
Alla Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలినట్టు అయ్యింది.. పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేసినట్టు తెలిపారు.. ముఖ్యంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవి బాధ్యతలు అప్పగించడమే ఈ రాజీనామాకు కారణంగా తెలుస్తుండగా.. తాను మాత్రం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు ఆర్కే ప్రకటించారు..
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్కే.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఓఎస్‌డీకి నా రాజీనామా లెటర్ అందించి రాజీనామా ఆమోదించేలా చూడాలని కోరడం జరిగిందంటూ తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే.. నేను 1995 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. 2004 లో సత్తెనపల్లి సీటు ఆశించా.. 2009లో పెదకూరపాడులో సీటు ఇచ్చి వెనక్కు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ తోనే నేను ఉన్నానని తెలిపారు.. 2014, 2019లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, నా వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
కాగా, పార్టీకి గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆర్కే ఆవేదనతో ఉన్నట్టుగా ప్రచారం జరగుతోంది.. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ.. బీసీలకు కేటాయిస్తుందనే ప్రచారం కూడా మరో కారణంగా చెబుతున్నారు.. ఈ క్రమంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. అయితే, తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా.. పార్టీ నేతలు ఎవరూ తనను సంప్రదించడంలేదనే ఆవేదన ఆయనలో ఉందంట.. ఇదే సమయంలో.. మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌గా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించడం.. నిన్న ప్రత్యేకంగా ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి ఆర్కేకు ఆహ్వానం లేకపోవడంతో.. ఇక, పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చిన ఆయన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు.. పార్టీ ప్రాథమికి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి.. గుడ్‌బై చెప్పారనే ప్రచారం సాగుతోంది.