Leading News Portal in Telugu

Adimulapu Suresh: నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి సురేష్‌


Adimulapu Suresh: నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి సురేష్‌

Adimulapu Suresh: మా టార్గెట్ 175 సీట్లు.. జగనన్న మా టీం కెప్టెన్ అని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. నియోజకవర్గ మార్పుపై స్పందించిన ఆయన.. నియోజకవర్గ మార్పుపై పార్టీ నిర్ణయమే శిరోధార్యం అన్నారు. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటాం.. పార్టీలో ఎప్పుడు ఓ సైనికుడిలా పనిచేస్తాం.. మా టార్గెట్ 175 సీట్లు.. జగనన్న మా టీం కెప్టెన్ అనే తేల్చిచెప్పారు. వచ్చే మ్యాచ్ గెలవాలంటే సీఎం వైఎస్‌ జగన్ కూర్పు ఎలా ఉన్నా ఆయన ఫీల్డ్ సెట్టింగ్ ప్రకారం నడుచుకుంటాం అన్నారు. కొండేపిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తాం తెలిపారు.

పార్టీ స్ట్రాటజీ ప్రకారం కొండేపి నియోజకవర్గంలో గెలవాలన్న ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తాం అన్నారు ఆదిమూలపు సురేష్‌.. గతంలో పనిచేసిన ఇంఛార్జ్‌లను కలుపుకుని.. వారి సహాయ సహకారాలతో తీసుకుంటా.. కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉందన్నారు. జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తాం.. వచ్చే ఎన్నికల్లో కొండేపిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు బావుటా ఎగుర వేస్తుందని ఆశిస్తున్నాం అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. కాగా, టార్గెట్ 2024.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. 175 నియోజకవర్గాల్లో.. సర్వేలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగులో దింపుతున్నారు. 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పజెప్పిన విషయం విదితమే.