
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యదర్శి పార్థసారథి అన్నారు. కానీ అధికారంలోకి రాగానే మాటతప్పాడు అంటూ విమర్శలు గుప్పించారు. గత నాలుగున్నర సంవత్సరాలలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని ఆయన ఆరోపణలు చేశారు. జగన్ ఎన్నికలకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట చెప్పి ప్రజలను మోసగించాడు అని బీజేపీ నేత డా.పార్థసారథి అన్నారు.
విద్యుత్ సంస్ధల ఒప్పందంలో తెలుగు దేశం పార్టీ అవినీతికి పాల్పడిందని చెప్పి.. అవే సంస్ధలతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం ఎలా చేసుకుందని బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి ప్రశ్నించారు. కరెంట్ దోపిడీకి అవినీతి ప్రోత్సహించే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అని ఆయన మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో ఏపీలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.