Leading News Portal in Telugu

Alla Ramakrishna Suspension: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేరుతో ఫేక్‌ లెటర్లు.. వైసీపీ ఆగ్రహం


Alla Ramakrishna Suspension: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేరుతో ఫేక్‌ లెటర్లు.. వైసీపీ ఆగ్రహం

Alla Ramakrishna Suspension: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంగళగరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ హైకమాండ్‌ సస్పెండ్‌ చేసినట్లు.. ఫేక్‌ లెటర్లు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ, అదంతా అవాస్తవం. ఇటీవల మంగళగిరి ఇంఛార్జ్‌గా పార్టీ మరొకరిని నియమించడంతో.. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు ఆర్కే. అయితే తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పారాయన. పార్టీపై కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా మంగళగిరిని ఆళ్ల అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు వైసీపీ నేతలు. సామాజిక సమీకరణాల వల్ల మంగళగిరి నుంచి ఆర్కే బదులు.. మరొకరిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆళ్లపై పార్టీ యాక్షన్‌ తీసుకుందని, సస్పెండ్‌ చేసిందని.. కొందరు సోషల్‌ మీడియాలో తప్పుడు లేఖలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్కే.. రాజీనామా కారణాల్ని వెల్లడించడానికి నిరాకరించారు. మంగళగిరిలో పార్టీ పరిస్థితిపై సమీక్షించిన నేతలు.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆర్కే స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలో దించాలని వైసీపీ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కేను సస్పెండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ఫేక్‌ లెటర్‌ సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఆర్కేను వైసీపీ సస్పెండ్‌ చేసిందన్న ప్రచారం అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది.