
Andhra Pradesh: రిజిస్ట్రేషన్లు వేగంగా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టింది. దీని కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను సైతం తీసుకొచ్చింది.. అయితే, ఏపీ సర్కార్ తెచ్చిన కార్డ్ 2.0 సాఫ్ట్‌వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. డిజిటలైజేషన్‌లో భాగంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో అనుసంధానం చేయడం, ఈకేవైసీ కోసం చేసిన ఏర్పాటు.. కొత్త సమస్యలకు కారణమవుతోంది. రెగ్యులర్‌గా జరిగే సేవలు తప్ప మిగిలినవి అన్నీ ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనివల్ల గంటలు తరబడి సబ్ రిజిస్టారు ఆఫీసుల్లో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి వస్తోంది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకువచ్చిన కార్డ్ ప్రైమ్ విధానంలో రెండుసార్లు ఈకేవైసీ చేయాల్సి వస్తోంది. మొత్తం 156 రకాల రిజిస్ట్రేషన్‌లు అందుబాటులో ఉండగా రెగ్యులర్‌గా జరిగే గిఫ్ట్, సేల్, జీపీలు తప్ప మిగిలినవి అన్నీ ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. రోజుకు సగటున 20 నుంచి 30 శాతం వరకు రిజిస్ట్రేషన్లు తక్కువగా అవుతున్నాయి. రెండుసార్లు ఈకేవైసీ చేయాల్సి రావడంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయి. విశాఖలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సర్వర్ ఇంటిగ్రేషన్‌లో సమస్యలు కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు అనంతపురంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు మాత్రం రోజుకు 60 రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెబుతున్నారు. మొదట్లో సాఫ్ట్ వేర్ లో సమస్యలు ఉన్నా.. రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నామని అంటున్నారు. ఇప్పటికైనా కొత్త సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.