Leading News Portal in Telugu

Ratha Saptami 2024: తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు.. భక్తులకు కీలక సూచనలు


Ratha Saptami 2024: తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు.. భక్తులకు కీలక సూచనలు

Ratha Saptami 2024: తిరుమ‌లలో రేపు రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఈ సందర్భంగా ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమ‌ల‌లో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తారు.. దీనినే ఒక్క రోజు బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు.. ఇక, ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండగా.. భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది.


రథసప్తమి వేడుకల సందర్భంగా శుక్రవారం రోజు ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు.. మొత్తం 7 వాహనాలపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు..

ఇక, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 67,275 మంది భక్తులు దర్శించుకోగా.. 25,293 మంది తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.