
Tirupathi ZOO Park: తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. సింహం అరుపులతో ఆ వ్యక్తి చెట్టు ఎక్కాడు. కానీ భయంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. ఆ వ్యక్తిని గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సింహం దాడిలో మృతి చెందిన మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్‌లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు తెలిసింది.