Leading News Portal in Telugu

Andhrapradesh: ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం


Andhrapradesh: ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Andhrapradesh: ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం “ఎడెక్స్”ల మధ్య ఒప్పందం కుదిరింది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించాయి.


రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000+ ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని, సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో రాష్ట్ర విద్యార్థులకు బోధన అందించనున్నారు. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ కానున్నాయి. ఈ ఆన్‌లైన్‌ కోర్సులు చేయడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు మంచి వేతనాలతో జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.