Leading News Portal in Telugu

Rajahmundry Rural: రాజమండ్రి రూరల్ జనసేనకే.. అభ్యర్థి ఖరారు..!



Rajahmundry Rural

Rajahmundry Rural: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలని నిర్ణయించిన విషయం విదితమే.. ఆ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందా? అనే విషయం తేలాల్సి ఉన్నా.. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు టీడీపీ-జనసేన పంచుకుంటున్నాయి.. ఇక, పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ టిక్కెట్ జనసేన పార్టీకే దక్కింది.. అంతే కాదు.. తమ అభ్యర్థి పేరును కూడా ఖరారు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. రాజమండ్రి రూరల్‌ నుంచి కందుల దుర్గేష్‌ పోటీ చేయనున్నట్టు పవన్‌ కల్యాణ్ వెల్లడించారు. ఆశావహులు, ముఖ్యనేతలతో పవన్‌ కల్యాణ్ సమావేశం ముగిసింది.. రాజానగరం, రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు పవన్‌.. అయితే రాజానగరం అభ్యర్థి ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ ఉమ్మడిగా అధికారికంగా కందుల దుర్గేష్‌ పేరును ప్రకటించనున్నారని నేతలు చెబుతున్నారు.. అయితే, కందుల దుర్గేష్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత ఖరారు చేయడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఆది నుంచి తనకే టికెట్‌ వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నారు కందుల దుర్గేష్‌.. మొత్తానికి ఈ రోజు పార్టీ అధినేత క్లారిటీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.