Leading News Portal in Telugu

Devineni Uma: ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు..సీఎం జగన్ కుప్పం పర్యటనపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని ఆరోపించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందా? అని ప్రశ్నించారు. 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు టీడీపీ హయాంలో పూర్తి చేయగా, మిగిలిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు సమయం పట్టిందా? అని అన్నారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం టీడీపీ 5 ఏళ్లల్లో రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

హంద్రీనీవాలో 672 కి.మీ. పనులు చేశానని జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని దేవినేని ఉమా దుయ్యబట్టారు. అవుకు టన్నెల్ పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్లిస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని తెలిపారు. పరదాలు కట్టుకొని తిరిగే జగన్ రెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. పట్టిసీమను పూర్తి స్థాయిలో వాడి ఉంటే హంద్రీనీవా ద్వారా కర్నూలు జిల్లా, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరందేదని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ లను తిట్టడానికే ఇరిగేషన్ మంత్రి ఉన్నారని విమర్శించారు. దమ్ముంటే ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. జగన్ రెడ్డికి ఇవే చిట్టచివరి ఎన్నికలు.. ఇంతటితో ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోతుందని అన్నారు.

Read Also: Vizag RK Beach: పర్యాటకులకు తప్పిన ప్రమాదం.. రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

మరోవైపు.. నగరిపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సీఎం జగన్ పర్యటనపై మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు సిగ్గు చేటు అని ఆరోపించారు. అభివృద్ధి చేసింది చంద్రబాబు అయితే, బటన్ నొక్కేది జగన్ అని దుయ్యబట్టారు. హంద్రీనీవా జలాలు పులివెందులకు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే, అది మరచి జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వాడు, రాష్ట్రానికి ఏమీ న్యాయం చేస్తాడని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముగ్గురు కలిసి జిల్లా ప్రజల రక్తం తాగారని ఆగ్రహం వ్యక్తం చేశారు.