
టీడీపీలో కొత్త ట్రబుల్ షూటర్స్ దిగారా? చంద్రబాబు వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా? పార్టీకి సంక్లిష్టంగా ఉండే నియోజకవర్గాలనే కొత్త నేతలకు టార్గెట్‌గా పెట్టారా? తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా…. ఏ నిర్ణయం తీసుకున్నా ఫర్లేదు, రిజల్ట్ ముఖ్యం అంటూ చంద్రబాబు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారా? ఇంతకీ ఎవరా ట్రబుల్ షూటర్స్? ఏంటా స్టోరీ?
చంద్రబాబు సొంత జిల్లా అయినా…ఉమ్మడి చిత్తూరు టీడీపీకి ఎప్పుడూ సంకటంగానే ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక, అసమ్మతిని నియంత్రించడం కత్తిమీద సాములాగే ఉండేది. అసంతృప్త నేతలు రోజుల తరబడి నిరసనలతో పార్టీని డ్యామేజ్ చేయడం వల్ల ఓడిపోయిన సందర్భాలు, సీట్లు సైతం ఉన్నాయి. 2019 ఎన్నికల్లో సైతం ఇదే సీన్ రిపీటైందన్నది జిల్లా పార్టీ వర్గాల్లో ఉన్న గట్టి అభిప్రాయం. కానీ… ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్. డూ ఆర్ డై అన్నట్టుగా ఉన్న దశలో ఇంకా నిర్లక్ష్యం చేస్తే… సీన్ సితార్ అవుతుందని గ్రహించిన అధిష్టానం ఈసారి రూట్ మార్చిందట. గత అనుభవాల దృష్ట్యా సొంత జిల్లా, సొంత నియోజకవర్గంతోపాటు పక్కనే ఉన్న ఐదు జిల్లాల కోసం కొత్త టీంను ఎంపిక చేశారు. పాత వారిని పక్కన పెట్టి కొత్తగా ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పజెప్పారు చంద్రబాబు. జోన్ -4 ఇన్ఛార్జ్‌గా కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని నియమించింది పార్టీ. చిత్తూరు, నెల్లూరు ,రాజంపేట, తిరుపతి, ఒంగోలు వ్యవహారాలను చూస్తున్నారాయన. ఇక కుప్పంలో మరో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారశైలి గురించే ఇటు టీడీపీలో, అటు వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది. జోన్ -4 లోని ఐదు జిల్లాల్లో దాదాపు 20 సీట్లుకు అభ్యర్ధులను ప్రకటించింది టీడీపీ. ప్రకటనకు ముందే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లోని అన్ని గ్రూపులతో సమావేశమై అంతా సెట్ చేశారట. దీంతో నియోజకవర్గాల్లో వాతావరణం మొత్తం గతానికి భిన్నంగా మారిపోయిందని, ఎక్కడా అసంతృప్తులు లేవన్నది పార్టీ వర్గాల టాక్.
ఇక తంబళ్ళపల్లె, చిత్తూరు, పూతలపట్టు, ఉదయగిరి ,కందుకూరు నియోజకవర్గాల్లో రోడ్డెక్కారు కార్యకర్తలు. తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులైతే ఏకంగా చంద్రబాబు నివాసంలోకే దూసుకెళ్ళి మరీ నిరసనకు దిగారు. అయితే అందర్నీ తంబళ్ళపల్లె పార్టీ ఆఫీసులోనే కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతోనే ప్రెస్‌మీట్ పెట్టించడంలో సక్సెస్ అయ్యారట ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. ఇక చిత్తూరులో సీట్లు రాని మొత్తం ఏడుగురు నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు. అందర్నీ సెట్‌చేసి పార్టీ ప్రకటించిన అభ్యర్థి గురజాల జగన్ గెలుపు కోసం పనిచేసేలా పావులు కదిపారట ఇన్ఛార్జ్. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అసమ్మతి నేతలు ఇంత త్వరగా ఎలా దారికి వచ్చారన్న చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో. ఇక పార్టీలోకి కీలక నేతల చేరిక విషయంలోనూ అదే పద్ధతి కొనసాగుతోందంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతలు వైసీపీ నుంచి టీడీపీలో చేరడం వెనక రాంగోపాల్‌రెడ్డి మంత్రాంగం ఉందన్న మాట వినిపిస్తోంది. అలాగే మరో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు సైతం అదే ప్రయారిటీ ఇచ్చారట చంద్రబాబు. కుప్పంలో నిరుడు శ్రీకాంత్‌కు బాధ్యతలు ఇచ్చి ఈసారి లక్ష మెజారిటీ టార్గెట్ పెట్టారు బాబు. ఒక రకంగా కుప్పం ఇన్ఛార్జ్‌గా ఉన్నారు శ్రీకాంత్. ఇలా పాతవారిని పక్కనపెట్టి కొత్తగా ఎమ్మెల్సీలు ఇద్దరినీ ట్రబుల్ షూటర్స్‌గా దింపడంపై స్థానికంగా విస్తృత చర్చ జరుగుతోంది.అదే సమయంలో గతానికి భిన్నంగా సొంత జిల్లాలో చంద్రబాబు చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందా లేక వికటిస్తుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.