Leading News Portal in Telugu

Off The Record : ఓటమెరుగని ఆ నేతకు ఇప్పుడు టికెట్ కూడా దొరకడం లేదా.. ఎందుకీ దుస్థితి..?



Jansena Otr

పేరుకు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ. కానీ… పిలిచి టిక్కెట్‌ ఇచ్చే దిక్కులేదు. రమ్మని పిలిచే పార్టీ లేదు. నువ్వొస్తానంటే మేమొద్దంటామని ముఖం మీద తలుపేసేవాళ్ళు తప్ప మాజీ మంత్రి సీనియారిటీని వాడుకుందామనుకునే వాళ్ళు మాత్రం లేరు. చివరికి ఇప్పుడు చేరిన పార్టీలో కూడా వితౌట్‌ కండిషన్స్‌ అంటున్నారట. ఇంతకీ అంత దారుణమైన స్థితిలో ఉన్న నాయకుడెవరు? ఎందుకంత దుస్థితి దాపురించింది?

కొత్తపల్లి సుబ్బారాయుడు….. పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్‌ లీడర్‌. ఓటమి ఎరుగని నేతగా ట్యాగ్‌లైన్‌. కానీ… అదంతా గతం. నర్సాపురం నియోజకవర్గం నుంచి టిడిపి తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి, మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకుడు 2012లో కాంగ్రెస్‌ నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి సీనియర్ మోస్ట్‌కు ఇపుడు పోటీ చేద్దామంటే అవకాశం లేకుండా పోయింది. ఒక్క ఛాన్స్‌… ప్లీజ్‌ ఒకే ఒక్క ఛాన్స్‌ అని అడిగినా పట్టించుకునే పార్టీ లేకుండా పోయిందట. ఒకప్పుడు చక్రం తిప్పిన నేత ఇపుడు ఎందుకు ఇలా అయిపోయారంటే చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అన్న సమాధానం వస్తోంది రాజకీయవర్గాల నుంచి. తాజాగా జనసేనలో చేరిన కొత్తపల్లి ఎలాంటి షరతులు లేకుండా పార్టీ అభివృద్ది కోసం పనిచేస్తానంటున్నా.. అక్కడ దొరుకుతున్న ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. 1989నుంచి టిడిపిని అంటిపెట్టుకుని ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత మారిపోయారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో అప్పటికే అనేక అవకాశాలిచ్చిన టిడిపికి ఎసరు పెట్టిమరీ పీఆర్పీలో చేరారు. సరిగ్గా అక్కడి నుంచే కొత్తపల్లి పొలిటికల్ కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్లు ఎదురవడం మొదలయ్యింది. పీఆర్పీలో ఓటమి, ఆ తర్వాత చిరంజీవితో కలిసి ముచ్చటగా మూడో పార్టీలో అడుగుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కొత్తపల్లికి. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగయ్యాక… టిడిపి పిలిచినా వెతుక్కుంటూ వెళ్ళిమరీ వైసీపీలో చేరిపోయారాయన. నాలుగోసారి పార్టీ మారడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన అనుచరగణం అక్కడితో ఆగిపోయారు. ఫలితం… మాజీ మంత్రి 2014లో వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పోనీ… అవకాశమిచ్చిన పార్టీలో అయినా కొనసాగారా అంటే అదిలేదు..చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వైసిపిని వదిలి ఐదోసారి పార్టీ మారుతూ తిరిగి టిడిపి గూటికి చేరారు. కానీ.. అక్కడ అంతకు ముందున్నంత ప్రాధాన్యత దక్కలేదు. పార్టీలోకి వచ్చామా, చేరామా, ఉన్నామా అన్నట్టుగానే ఉందట వ్యవహారం. దీంతో మళ్ళీ మూడ్‌ మారిపోయిన సుబ్బారాయుడు ఆరోసారి పార్టీ మారి వైసిపిలోకి ఎంటరయ్యారు. పార్టీలు మారడం ఆయన హబీ అని ఫిక్సైన వైసిపి కూడా మాజీ మంత్రిని లెక్కల్లోంచి తీసేసింది. దీంతో 2019లో ఎక్కడి నుంచి పోటీచేయాలో అర్దంగాక సైలెటయ్యారు సుబ్బారాయుడు. వైసిలోనే కొనసాగుతున్నా.. అక్కడి నేతలతో విభేదాలొచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకునేవరకు వెళ్ళింది.

రెండేళ్ళ నుంచి న్యూట్రల్‌గా ఉన్న మాజీ మంత్రి టిడిపిలోగాని, వైసిపిలోగాని తిరిగి చేరేందుకు నానా ప్రయత్నాలు చేశారట. ఇలాంటి జంపింగ్‌ జపాంగ్‌ని అసలు పార్టీలోకి రానివ్వడమే ఎక్కువనుకుంటున్న టైంలో సారువారు షరతులు కూడా పెట్టేశారట. ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తానంటేనే…. నేను ఎంట్రీ ఇస్తానంటూ కండిషన్స్‌ అప్లై అనడంతో ఇక చాలు…. మీ సేవలు. మిమ్మల్ని భరించే ఓపిక మాకు లేదని ఓ పెద్ద నమస్కారం పెట్టేసిందట తెలుగుదేశం అధినాయకత్వం. దీంతో సారువారికి జ్ఞాన నేత్రాలు తెరుచుకుని కామైపోయారట. ఎంతైనా పవర్ పాలిటిక్స్‌కి అలవాటుపడ్డ ప్రాణం కదా… అందుకే… ఇప్పుడు ఇక తాను కాలు పెట్టకుండా మిగిలి ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన తలుపుతట్టారట. అక్కడ కూడా నీ పప్పులేం ఉడకవ్… కావాలంటే కండువా కప్పుకుని గమ్ముగా వచ్చి పార్టీలో చేరమనగానే అదే మహద్భాగ్యం అన్నట్టు చేరిపోయారీ మాజీ మంత్రి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటానంటూ మంగమ్మశపధాలు చేసిన కొత్తపల్లి… ఇపుడు ఎలాంటి షరతులు లేకుండానే జనసేనలో చేరి ఒక్క ఛాన్స్‌… ప్లీజ్‌ ఒక్క ఛాన్స్‌ అంటు ఆశగా ఎదురు చూస్తున్నారట. అయినా ఆయన ఆశలు నెరవేరే అవకాశం లేదన్నది లోకల్‌ టాక్‌. ఇప్పటికే జనసేన నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మడి నాయకర్ రేసులో ఉన్నారు. పదేళ్ళనుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకర్‌ను కాదని జనసేన ఇపుడే పార్టీలోకొచ్చిన కొత్తపల్లికి అవకాశం ఇస్తుందని ఆపార్టీ క్యాడర్ భావించడంలేదు. దీంతో ఒకప్పుడు జిల్లాలో వన్ మ్యాన్ ఆర్మీగా ఉన్న కొత్తపల్లి ఇపుడు వందల మంది సైనికుల్లో ఒకడిగా మిగలాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్థిరత్వం లేకుండా అవకాశవాద రాజకీయాలతో పార్టీలుమారుతూ రావడం వల్లే ఆయన పొలిటికల్‌ ఇంత పతనావస్థకు చేరిందన్నది కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరిని కదిలించినా చెప్పే మాట. పైగా పాత కాలం ఫార్ములాతో ఎన్నికల ముందు కుర్చీకోసం కర్ఛీఫ్‌ వేసే ఆలోచనలనుంచి బయటపడలేకపోవడం ఒక మైనస్ అని కొందరు, ఆయనకి అవసరముంటే తప్ప ఎవరినీ పట్టించుకోరని ఇంకొందరు అంటున్నారు. సమయంలేదు మిత్రమా అని ఎందరు నెత్తీ నోరూ బాదుకున్నా… ఒక్కరోజుకూడా టైమ్‌ పాటించరని సన్నిహితులు తలోవైపు కాకుల్లా పొడుస్తున్నారు ఇప్పుడు. పూటకో పార్టీ అన్నట్టుగా ఎడాపెడా చేసిన జంపింగ్స్‌ వల్లే సీనియర్‌ లీడర్‌ అయినా… ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాలేదంటున్నారు. దీంతో రాజకీయాల్లో నలబై ఏళ్ల అనుభవమున్న నేత 24సీట్లకు పరిమితమైన పార్టీవైపు నిలబడాల్సి వచ్చిందని నిట్టూరుస్తున్నారు ఇప్పటికీ ఆయనంటే అభిమానం ఉన్నవాళ్ళు.