
Vande Bharat Trains: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చని సెమీ హైస్పీడ్ రైల్ ‘‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’’ తరుచుగా దాడులకు గురవుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు రైలు ప్రయాణిస్తున్న సమయంలో రాళ్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. తాజాగా నైరుతి రైల్వే(ఎస్‌డబ్ల్యూఆర్) జోన్ గుండా వెళ్తున్న 4 వందేభారత్ ట్రైన్లపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని అధికారులు మంగళవారం తెలిపారు. ఈ దాడుల్లో ప్రయాణికులకు, సిబ్బంది ఎలాంటి గాయాలు కాలేదని, అయితే, రైళ్ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
Read Also: Google: గూగుల్ యూటర్న్.. ప్రభుత్వ విమర్శలతో భారతీయ యాప్‌ల రీలిస్ట్..
రాళ్లదాడికి సంబంధించి ఒక్కో ఘటనపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి సంఘటన ఉదయం 6.15 గంటలకు చిక్కబాణవర రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ధర్వాడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరిగింది. మధ్యాహ్నం 3.20 గంటలకు ధర్వాడ్ నుంచి బెంగళూర్ సిటీ జంక్షన్ వరకు నడుస్తున్న రైలుపై జరిగింది. మూడో ఘటన సాయంత్రం 4.30 గంటలకు మైసూర్ జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లున్న రైలుపై ఏపీలోని కుప్పం స్టేషన్ వచ్చే ముందు రాళ్లతో దాడి చేశారు. నాలుగో ఘటన రాత్రి 8 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం జంక్షన్ సమీపంలో జరిగిందని అధికారులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు.