
ఒకరు సిట్టింగ్ ఎంపీ… ఇంకొకరు అదే సీటు ఆశిస్తున్న సీనియర్ లీడర్. ఇద్దరూ ఒకే వేదిక మీద ఉన్నారు. ఈసారి నేనిక్కడ పోటీ చేయబోతున్నాను. సీటు నాదేనని సిట్టింగ్ ముందే ప్రకటించారు ఆశావహుడు. అయినా ఎంపీ నుంచి నో రియాక్షన్. అసలా విషయం తనకు సంబంధించింది కాదన్నట్టే ఉన్నారు. ఆమె ఎందుకలా ఉన్నారు? ఏంటి వ్యూహం? అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట పార్టీ నేతలు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏదా నియోజకవర్గం? అమలాపురం ఎంపీ టిక్కెట్‌పై వైసీపీలో తీవ్ర తర్జనభర్జన నడుస్తోందట. రకరకాల పేర్లు తెరమీదికి వస్తున్నా….ఏదీ ఖరారవక సస్పెన్స్ అంతకంతకూ పెరుగుతోంది. మొదట ఒక ఐఏఎస్ అధికారి పేరు వినిపించింది. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. ఇప్పుడు కొత్తగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీన్లోకి వచ్చారు. టీడీపీ తరపున దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ దాదాపు ఫిక్స్ అయినట్టే. ఆయనకు దీటైన అభ్యర్థి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది అధికార పార్టీ. కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు పేరు కూడా ఆలోచించినా ఆయన్ని రాజోలుకే పరిమితం చేయాలనుకుంటోందట అధినాయకత్వం. అధికారికంగా ఖరారు కాకపోయినా అమలాపురం ఎంపీ బాధ్యతను రాపాక వరప్రసాద్ కు అప్పగించేందుకే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
రాపాక కూడా ఎంపీ రేస్‌లో ఉన్నానని చెబుతున్నారు. అయితే తాజాగా సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ సమక్షంలోనే ఆయన ఈ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు…. పోటీకి సిద్ధంగా ఉన్నానని అన్నారాయన. అయితే రాజోలు నియోజకవర్గం వైసీపీ శ్రేణులు మాత్రం రాపాక వరప్రసాద్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకే అధిష్టానం ఆయన పేరును అధికారికంగా ప్రకటించకుండా వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలిసింది. ఆ వ్యవహారం అలా ఉంచితే… తాను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని సిటింగ్ ఎంపీ చింతా అనురాధ ముందే రాపాక ప్రకటించడం, అది విని ఆమె మౌనంగా ఉండటంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో చింతా అనురాధ పోటీ చేస్తారా? లేక పక్కకు తప్పుకుంటారా? అన్నదే లోకల్ హాట్ టాపిక్ అయింది. ఎవరెవరో మాట్లాడినదానికి నేను రియాక్ట్ అవడం ఎందుకు? ఈసారి మహిళల కోటాలో టిక్కెట్ నాకే వస్తుందన్న ధీమా మేడమ్‌కు ఉందని చెబుతున్నారు ఆమె సన్నిహితులు. అదే సమయంలో ఒకవేళ టిక్కెట్ ఇవ్వకున్నా… గౌరవంగా తప్పుకుని వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తారని ముక్తాయింపు ఇస్తుండటంతో గందరగోళం మరింత పెరుగుతోంది. అంటే ఇప్పుడు చింతా అనురాధ అమలాపురం రేస్‌లో సీరియస్‌గా ఉన్నట్టా? లేనట్టా? అన్న డౌట్స్ వస్తున్నాయట వైసీపీ కేడర్‌కు. మరోవైపు అనురాధ భర్త టి ఎస్ ఎన్ మూర్తి సైతం వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ అధిష్టానం ఇప్పటికే కోనసీమ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. తామే అభ్యర్థులమన్న ధీమాతో కొంతమంది ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఒక్క లోక్‌సభ క్యాండిడేట్ పేరు మాత్రమే ప్రకటించలేదు. రాపాక, అనురాధతో పాటు పదిమందిపైగా ఆశావాహులు ఈ టిక్కెట్ రేస్‌లో ఉన్నారు. కాస్త సీరియస్ అనుకున్న పేర్లన్నిటినీ లైన్లో పెట్టి సర్వే నిర్వహిస్తోందట ఐ ప్యాక్ టీమ్. దీంతో చివరికి అభ్యర్థిగా ఎవరు తేలతారన్న ఉత్కంఠ పెరుగుతోంది. రాపాక, అనురాధ మధ్యనే ఉంటుందా? లేక కొత్తగా మూడో వ్యక్తి సీన్లోకి వస్తారా అని ఆసక్తిగా చూస్తున్నాయి వైసీపీ శ్రేణులు.