Leading News Portal in Telugu

Off The Record : TDP నేతల మీద కొత్త కేసులు పడబోతున్నాయా..? హైకమాండ్ అలర్ట్..!



Tdp Cases

ఉన్నవి చాలవన్నట్టు టీడీపీ నేతల మీద కొత్త కొత్త కేసులు పడబోతున్నాయా? ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులే టార్గెట్‌గా బుక్‌ అవుతాయని పార్టీ అనుమానిస్తోందా? టీడీపీ అధిష్టానానికి ఇప్పుడా డౌట్‌ ఎందుకు వచ్చింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోంది? అసలీ కొత్త కేసుల కథేంటి? ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రేపోమాపో షెడ్యూల్ వచ్చే ఛాన్స్‌ ఉంది. ఆ వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థులను ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే కొత్త కేసుల వ్యవహారం. బరిలో నిలవబోయే కీలక నేతల మీద కానీ, వారి కుటుంబ సభ్యుల మీద కానీ కొత్తగా కేసులు బుక్‌ చేయడమో లేదా ఇప్పటికే ఉన్న వాటిని వేరే రకంగా తిరగదోడాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్టు అనుమానిస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ముఖ్య నేతలకు అందుతున్న సమాచారాన్ని బేస్ చేసుకుని పార్టీలో ఈ తరహా ఆందోళన పెరుగుతున్నట్టు సమాచారం. తాజాగా మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్ట్ తర్వాత పార్టీలో ఈ తరహా చర్చ ఎక్కువగా జరుగుతోందట. ఆధారాలు ఉన్నాయా? లేవా? అది తమ పరిధిలోకి వస్తుందా లేదా? అన్న సంగతి పట్టించుకోకుండా… ముందైతే లోపల వేసేద్దాం తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని, అడ్డగోలు కేసులతో ఏదోరకంగా ఇబ్బంది పెట్టడమే వాళ్ళ టార్గెట్‌ అని అంటున్నారు మెజార్టీ టీడీపీ లీడర్స్‌. ప్రత్తిపాటి కుమారుడి అరెస్ట్‌ విషయంలోనే నివ్వెరపోయాయట టీడీపీ శ్రేణులు. దీంతో పార్టీ ముఖ్య నేతలు వివిధ మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటే…. మరిన్ని కేసులు తెర మీదకు వచ్చే సూచనలున్నాయన్న సమాచారం తెలిసిందట. అందుకే మరింత అలెర్ట్‌గా ఉండాలని పార్టీ అభ్యర్థులకు, కీలక నేతలకు అధిష్టానం నుంచి సూచనలు వెళ్లినట్టు సమాచారం.ఈ క్రమంలో అచ్చెన్నాయుడు, ధూళిపాళ నరేంద్ర, కన్నా లక్ష్మీ నారాయణ, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి, పయ్యావుల కేశవ్‌, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి కుమార్, శ్రీనివాసులు రెడ్డి, జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం.. ఇలా చాలామంది ఏపీ పోలీస్‌ స్కానర్‌ కింద ఉన్నట్టు క్లారిటీ వచ్చిందట.

టార్గెట్‌లో ఉన్నవారి వైపు నుంచి ఏ చిన్న తప్పు జరిగినా.. వారి వ్యాపార వ్యవహారాల్లో చిన్న లోపం కనిపించినా.. వెంటనే కేసులు బుక్‌ చేసేసి.. ఎక్కడి వరకైనా వెళ్లేలా పక్కా ప్రణాళికతో అధికార పార్టీ పూర్తి స్థాయిలో రంగం సిద్దం చేసుకుందనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. అంతే కాకుండా.. గత ఐదేళ్ల కాలంలో ఎవరిపై ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయన్న అంశంపై కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. కేసులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెప్పించుకోవాలని సూచిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. ఇటీవల చంద్రబాబు కూడా తనపై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి..? తనకు తెలియకుండానే ఏమైనా కేసులు నమోదు చేశారా..? అనే అంశాలపై వివరాలు కావాలంటూ డీజీపీతో పాటు.. వివిధ దర్యాప్తు సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో తమ మీదున్న కేసుల వివరాలను పొందు పర్చాల్సి ఉంది. అయితే గుట్టుచప్పుడు కాకుండా.. కేసులు నమోదు చేసేసి.. నామినేషన్ దాఖలు చేశాక కేసుల చిట్టాను బయటకు తీస్తే.. నామినేషన్‌ చెల్లుబాటు కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చంద్రబాబు ముందుగానే కేసుల వివరాలు కోరుతూ లేఖలు రాశారు. పార్టీ అభ్యర్థులందరూ అదే తరహా విధానాన్ని అనుసరించాలని సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా ఓ అడ్వకేటును అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారట చంద్రబాబు. న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించే అవకాశం చాలా ఎక్కువగా కన్పిస్తున్న క్రమంలో ప్రత్యేక అడ్వకేటు తప్పనిసరి అనే చెబుతోందట టీడీపీ అధిష్టానం. ఓవైపు కేసులు పెట్టడం ద్వారా.. అభ్యర్థులు ఎన్నికల్లో పూర్తి ఫోకస్ పెట్టలేని పరిస్థితి కల్పించడం ఓ ఎత్తు అయితే.. గుట్టుచప్పుడు కాకుండా.. కేసులు బుక్‌ చేసి నామినేషన్లు చెల్లుబాటవకుండా చేయాలన్నది మరో ఎత్తుగడగా అనుమానిస్తోందట టీడీపీ. అందుకే ఇప్పుడు కేసులు అంటేనే ఉలిక్కి పడుతున్నారు టీడీపీ నేతలు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది పార్టీ అధిష్టానం.