Leading News Portal in Telugu

Chandrababu Naidu: ఎవరి త్యాగాలు వృథా కావు… ఎమ్మెల్సీలు, చైర్మన్లుగా అవకాశం కల్పిస్తాం..



Babu

Chandrababu Naidu: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల వల్ల కీలక నేతలు సైతం సీట్లను త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఎవరి త్యాగాలు వృథా కావు.. సీట్లు త్యాగం చేసినవారికి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పిస్తాం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. టీడీపీనే కాదు, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ కేడర్ పైనే ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఐదేళ్లుగా ప్రాణాలకు తెగించి పోరాడారు. సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలు, చైర్మన్లుగా అవకాశం కల్పిస్తాం. ఎవరి త్యాగాలూ వృథా కావు అన్నారు చంద్రబాబు.

ముస్లింలకు తీరని ద్రోహం చేసింది వైఎస్‌ జగనే అని మండిపడ్డారు చంద్రబాబు.. ముస్లింల పథకాల రద్దు చేశాడు.. ముస్లింలపై దాడులు చేయించాడని విమర్శించారు.. బీజేపీతో పొత్తుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్న ఆయన.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీల పొత్తు.. చరిత్రలో నిలిచేలా చిలకలూరిపేట సభ ఉండబోతోందన్నారు. ముస్లింలకు జగన్ ఏమీ చేయలేక మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు కాపాడింది టీడీపీనే. పార్టీ తరపున నాడు కోర్టులో వాదించేందుకు అడ్వకేట్లను నియమించాం. పండుగ సమయంలో రంజాన్ తోఫాతో పాటు, దుల్హన్ పథకంతో ముస్లింలను ఆదుకున్నాం. కానీ, ముస్లింల కోసం టీడీపీ తెచ్చిన 10 పథకాలను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు.

వాలంటీర్లను ఇంటింటింటికి పంపి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్‌ అయ్యారు చంద్రబాబు.. కావాలనే కొన్ని కులాలను జగన్ ఎదగనీయకుండా అణగదొక్కారు. చిలకలూరిపేట సభను చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం అని.. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజల గెలవాలి.. రాష్ట్రం నిలవాలి అనే సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నాం. ఎవరికెన్ని సీట్లనేది ముఖ్యం కాదు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం అందరి బాధ్యత. పొత్తులో భాగంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలి. పొత్తులో భాగంగా టీడీపీపై పవిత్రమైన బాధ్యత ఉంది. మూడు పార్టీల నేతలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. జగన్ అరాచకాలతో రాష్ట్రం విధ్వంసం అయింది. కేంద్రసాయం ఉంటే రాష్ట్రాభివృద్ధికి నిధులు వస్తాయి. కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉంటే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రచారంలో ఎవరు ముందుంటారో వారిదే యుద్ధంలో పైచేయి. దొంగ ఓట్లు పడటానికి అవకాశమే ఉండకూడదని అందరినీ అప్రమత్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.