
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయాలు తిరగబడింది. దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.
వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు: చంద్రబాబు
మరోవైపు.. చంద్రబాబుతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో వర్మతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి పిలిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ ఎంత కృషి చేశాడని పేర్కొన్నారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నడంతో వర్మ ఆయనకు సహకరించాలని కోరానన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపునకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారన్నారు. వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు.. పిఠాపురం వర్మకి మొదట విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపించాలని.. టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానులు పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేయాలన్నారు. వర్మ అభ్యర్థి అయితే ఎలా పని చేస్తారో అదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గెలుపునకు పని చేయాలని చంద్రబాబు తెలిపారు.
గెలుపు బాధ్యత మేమే తీసుకుంటాం:
పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ మాట్లాడుతూ.. పిఠాపురంలో టీడీపీ పునాదులు బలంగా ఉన్నాయని అన్నారు. తమ ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకువచ్చామన్నారు. తానేం వేరే పార్టీల వైపు చూడలేదు.. అధినేత నిర్ణయంపై కొంత మనస్థాపం చెందామని తెలిపారు. పిఠాపురం అభివృద్ధి బాధ్యత తనది అని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాను ఏ పదవి కోరకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ తనను పిలిస్తే వెళ్లి కలుస్తాను.. గెలుపు బాధ్యత తామే తీసుకుంటామని వర్మ చెప్పారు.