
రెండు ఓట్లు ఉన్నవాళ్ళు ఈసారి ఎక్కడ ఓటేస్తారు? వారి ప్రయారిటీ ఎటువైపు ఉండవచ్చు? రాజకీయ వర్గాల్లో కొత్తగా మొదలైన చర్చ ఇది. అదేంటీ… ఎవరికైనా ఉండాల్సింది ఒక ఓటే కదా? అదే కదా రూల్? రెండు ఓట్లు ఇల్లీగల్ కదా… అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈసారి ఎన్నికల్లో ఈ డబుల్ బాబులకు వెరైటీ కష్టం వచ్చేసిందట. ఇంతకీ ఏంటా డబుల్ ఓట్స్ స్టోరీ? వాళ్ళకు వచ్చిన కొత్త కష్టం ఏంటి? ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్… తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నవారు ఏం చేస్తారన్న ఆసక్తిరక చర్చ మొదలైంది. వేర్వేకు ఫేజ్‌లలో పోలింగ్ జరిగితే రెండు చోట్లా ఓటేసే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. కానీ… ఈసారి రెండు రాష్ట్రాలకు కలిసి నాలుగో విడతలోనే పోలింగ్ జరగబోతుండటంతో కొత్త చర్చకు తెర లేచింది. వాస్తవానికి ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఓటు హక్కు ఉండాలి. కానీ… ప్రస్తుతం హైదరాబాద్, పరిసరాలల్లో స్థిరపడ్డ సీమాంధ్రుల్లో చాలా మందికి అటు సొంత ఊళ్ళోను, ఇటు హైదరాబాద్‌లోనూ ఓట్లున్నాయి. ఆధార్ లింక్ లేకుండా ఇలా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉందట. దీంతో ఇప్పుడు వాళ్లంతా సొంతూరికి వెళ్ళి అక్కడ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులకు ఓట్లేస్తారా? లేక హైదరాబాద్‌లో ఉండి ఇక్కడి ఓటు హక్కు వినియోగించుకుంటారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. డబుల్ ఓట్లు, దొంగ ఓట్లను ఏరి పారేస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్న ఎన్నికల సంఘం…దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా…చర్యలు మాత్రం శూన్యం.
గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండు ప్రాంతాల్లో వేర్వేరు తేదీల్లో పోలింగ్ జరిగితే.. రెండు చోట్ల ఓటేసిన వారు చాలా మందే ఉన్నారు. అయితే… ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా ఉన్నా… రెండు చోట్లా ఒకే రోజు అంటే… మే 13నే పోలింగ్ జరగనుంది. అందుకే అలా డబుల్ ఓట్లున్నవాళ్ళు ఎటు వైపు మొగ్గుతారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఓటుకు సై అంటారా? లేక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడి ఓటుకే ప్రాధాన్యం ఇస్తారా అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నియోజక వర్గాల్లో లక్షల మందికి రెండు రాష్ట్రాల్లో ఓటు ఉంది. ఇవి ఫలితాలను ప్రభావితం చేయగల స్థాయిలో కూడా ఉంటాయి. అందుకే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏ రాష్ట్రంలో ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోందట రాజకీయ నేతల్లో. రెండు చోట్ల కేవలం లోక్‌సభ ఎన్నికలే అయితే… పరిస్థితి వేరుగా ఉండేదని, కానీ… ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఎక్కువ మంది అటువైపే మొగ్గుతారన్న అభిప్రాయం బలపడుతోంది. సాధారణంగా ఎంపీకంటే… ఎమ్మెల్యే మీదనే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఫస్ట్ ప్రయారిటీ ఉంటాయని విశ్లేషిస్తున్నారు ఎక్కువమంది. వైసీపీ, టీడీపీ, జనసేన… ఇలా అన్ని పార్టీల అభిమానులు, సానుభూతిపరులు హైదరాబాద్‌లో ఉన్నారు గనుక అంతా అంతా అసెంబ్లీకి ఓటెత్తవచ్చంటున్నారు. అదే సమయంలో… వీళ్ళంతా ఏపీకి వెళ్తే… జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపీ అభ్యర్థుల పోల్ పర్సంటేజ్ తగ్గవచ్చన్న అంచనాలు సైతం ఉన్నాయి. పద్ధతిగా ఓటేద్దామనుకున్నవారికి ఎక్కడైనా ఓకే. కానీ… గతంలోలాగా రెండు చోట్ల ఓటేసి డూ ఫెస్టివల్ అందామనుకున్న వారికి మాత్రం ఇది ఇబ్బందికరమేనన్న వాదన సైతం వినిపిస్తోంది.