
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం- జనసేన- భారతీయ జనత పార్టీ (ఎన్డీయే) కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం ఏర్పడిన కూటమికి సపోర్ట్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్ల పేర్కొన్నారు. తీవ్ర ప్రమాదంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భావసారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి రావాలని ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Read Also: Kareena Kapoor: బాలీవుడ్ కుర్ర భామలే కాదు.. ముదురు భామలు కూడా సౌత్ ని వదలట్లే?
కాగా, జయప్రకాష్ నారాయణ లాంటి మేధావి తమ కూటమికి మద్దతుగా నిలవడం నిజంగా ఆనందకరమైన విషయం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తున్నందుకు ట్విటర్ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే, మరోవైపు గతంలో టీడీపీ మద్దతుతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి జయ ప్రకాష్ నారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మరో సారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత లోక్ సత్తా పార్టీకి కూడా ఆయన దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో మద్దతుపై జయ ప్రకాశ్ నారాయణ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.