
ముందు మూడన్నారు…. తర్వాత రెండయ్యాయి. ఇప్పుడు ఒకటేనంటే ఎలా? మరీ ఇంత త్యాగరాజులైతే ఎలా? సర్దుకుపోవడానికి కూడా ఓ హద్దు ఉండాలి కదా… ఇదీ ఇప్పుడు జనసేన అధిష్టానాన్ని ఉద్దేశించి ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న మాట. అత్యంత కీలకమైన జిల్లాలో ఒక్క సీటుకు పరిమితం అయితే పరువేం కావాలంటూ ప్రశ్నిస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా? పార్టీ అధిష్టానం ఎందుకు కాంప్రమైజ్ అవుతోంది? ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేన పోటీ చేసే స్థానాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త చర్చ జరుగుతోంది. మొదటి నుంచి ఇక్కడ మూడు స్థానాల్లో గ్లాస్ పార్టీ పోటీ చేస్తుందని విస్తృత ప్రచారం జరిగింది. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, పెడన స్థానాలు తమకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు కూడా భావించారు. అయితే పెడన సీటుకు టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేరు ప్రకటించడంతో లిస్టు నుంచి ఒక సీటు తగ్గి రెండుకు చేరుకుంది. దీంతో తమకిక రెండేనని దాదాపుగా ఫిక్సయ్యారు జిల్లా జనసేన నేతలు. బెజవాడ పశ్చిమ, అవనిగడ్డ తమవేనని భావిస్తున్న టైంలో పొత్తులోకి దూసుకొచ్చింది బీజేపీ. ఈ సీటుకోసం టీడీపీ నేతలు దాదాపు మినీ యుద్ధమే చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బలప్రదర్శన చేయటంతోపాటు రక్తంతో చంద్రబాబుకు జిందాబాద్ అని రాసి మరీ గురుభక్తిని చాటుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా బలప్రదర్శనతోపాటు వైసీపీలోకి జంప్ అవుతా అంటూ ఝలక్ ఇచ్చారు. ఇంత చేసినా టీడీపీ అధిష్టానం మాత్రం వత్తిళ్లకు లొంగకుండా… ఆ టిక్కెట్ జనసేనదేనన్న సంకేతాలు పంపింది.
ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పోతిన మహేష్ ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్నారు. టికెట్ మళ్ళీ తనకే వస్తుందని గట్టిగా నమ్మిన పోతిన పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. అయితే ఇప్పుడు ఈ టికెట్ బీజేపీకి ఇస్తారనే ప్రచారంతో పోతినతో పాటు జనసేన క్యాడర్ కూడా షాక్‌లో ఉందట. పొత్తులో భాగంగా బీజేపీ బెజవాడ సెంట్రల్ సీటు కోరుతోంది. అయితే టీడీపీ ఇప్పటికే అక్కడ బోండా ఉమాను అభ్యర్ధిగా ప్రకటించటంతో అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పవన్.. తన కోటాలో ఉన్న పశ్చిమ సీటును బీజేపీకి త్యాగం చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీకి పశ్చిమ నుంచి పోటీ చేయటంపై పెద్దగా ఆసక్తి లేదనేది లోకల్ టాక్. ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గం ఎక్కువగా ఉండటంతోపాటు 2014లో ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. దీంతో ఓడిపోయే సీట్లు తమకు ఇస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిందట బీజేపీ రాష్ట్ర నాయకత్వం.
ఇక టీడీపీ కూడా పశ్చిమ సీట్లో తాము కాకుంటే జనసేన పోటీ చేస్తేనే కూటమికి ఓట్లు పడతాయని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే జనసేనకే టికెట్ ఇవ్వాలంటూ పోతిన మహేష్ చేస్తున్న ఆందోళనలు లోకల్‌గా చర్చ రేపుతున్నాయి. ఓవైపు పశ్చిమ విషయంలో గందరగోళం ఇలా నడుస్తున్నా… అటు క్లియర్‌గా ఉన్న ఒక్కగానొక్క సీటు అవనిగడ్డలో కూడా అభ్యర్థిని తేల్చలేకపోతున్నారట పవన్‌కళ్యాణ్. ఇక్కడ విక్కుర్తి శ్రీనివాస్ పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది.మొత్తంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి కృష్ణాలో మూడు సీట్లలో పోటీకి ప్రయత్నించిన జనసేన కనీసం రెండు చోట్లయినా బరిలో ఉంటే బాగుంటుందన్నది పార్టీ నేతల మాట. బెజవాడ లాంటి రాజకీయ చైతన్యం ఉండే చోట పార్టీ పోటీకి దిగకుంటే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని పార్టీ నేతల అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైతే నేతలు, క్యాడర్ సంగతి పక్కన పెట్టినా ఓట్ ట్రాన్స్ ఫర్ పై కూడా అది ప్రభావం చూపుతుందనేది జనసేన నేతల ఆందోళనగా ఉందట. మరి పవన్‌కళ్యాణ్ ఫైనల్‌గా బీజేపీ కోసం మరో త్యాగం చేస్తారో లేక తన పార్టీ మనుగడ కోసమన్నా రెండు సీట్లలో పోటీ చేస్తారో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.