
పోటీలో నేను లేనప్పుడు ఎవరు గెలిస్తే నాకేంటి? అది పొత్తు ధర్మమా? మరోటా అన్నది జాన్తానై? మన మిత్ర పక్షం గెలిస్తే ఓకే… ఓడి ప్రత్యర్థి గెలిచినా… నా కులపోడే…కాబట్టి నాకు ఊడేదేం లేదు. ఇలా ఉందట అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వైఖరి. జనసేన గెలిచినా, వైసీపీ గెలిచినా నాకొచ్చేదేంటన్న రీతిలో ఉన్న ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? వైశాల్యం, ఓటర్ల పరంగా చిన్నదైనా…రాజకీయ చైతన్యం పరంగా అతిపెద్ద ప్రభావం చూపగల సెగ్మెంట్ నరసాపురం. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి కాపుల ప్రభావం ఎక్కువ.అలాంటి చోట ఈసారి ప్రధాన పార్టీలు రెండూ ఆ సామాజికవర్గానికి అవకాశం కల్పించలేదు. వైసిపి నుంచి ముదునూరి ప్రసాద్ రాజు పోటీలో ఉండగా.. జనసేన తరపున కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ పోటీ పడుతున్నారు. దీంతో రెండు పార్టీలు తమను విస్మరించాయని అసంతృప్తితో రగిలిపోతున్నారట కాపులు. పైగా టిడిపి ఇన్చార్జిగా ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పొత్తూరి రామరాజు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఆయన వైఖరితో టిడిపిలోని కాపులు, జనసేనలోని మరో వర్గం తీవ్ర అసహనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పొత్తు లెక్కలు పూర్తయిన నరసాపురంలో టిడిపి జనసేన నేతలు, కేడర్ మధ్య సయోధ్య కుదరకపోవడానికి ప్రధాన కారణం ఇన్చార్జి వ్యవహార శైలి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రామరాజు తన ఆధిపత్యం కోసం కాపు నేతలకు ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారన్నది ఆయన మీదున్న అభియోగం.
పైగా నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన గెలిచినా ఓడినా తన ఇన్చార్జి పదవికి ఇబ్బంది లేదని, వైసీపీ అభ్యర్థి గెలిస్తే… తన సామాజిక వర్గం వ్యక్తే కాబట్టి ఎలాంటి గొడవ ఉండదన్న ధోరణిలో రామరాజు వ్యవహారశైలి ఉందన్నది లోకల్ టాక్. సొంత పార్టీ నేతలు సైతం ఈ దిశలోనే ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. కీలకమైన కాపు నేతల్ని పక్కనబెట్టి జనసేనకు సపోర్ట్ చేసినంత మాత్రాన ఫలితం ఏముంటుందనేది ఇక్కడి నేతల ప్రశ్న. జనసేన తరపున అభ్యర్థిగా బరిలో దిగబోతున్న బొమ్మిడి నాయకర్ కు, కాపు సామాజిక వర్గానికి మధ్య మొదటి నుంచి గ్యాప్ ఉంది.ఈ సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన టిడిపి ఇన్చార్జ్ దూరాన్ని పెంచుతున్నారు తప్ప స్వయోధ్య కుదర్చే ప్రయత్నం చేయడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. పొత్తు ధర్మం కంటే కంటే తన స్వలాభమే ఎక్కువగా చూసుకుంటున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఎన్నారై కొవ్వలి నాయుడు అంతా కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు. టీడీపీలో పనిచేసిన అనుభవంతో నియోజకవర్గంపై పట్టున్న నేతలుగా కూడా పేరుంది. ఇదే సమయంలో పక్కన పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన పొత్తూరి రామరాజు నరసాపురం టిడిపి ఇన్చార్జిగా కొనసాగడంతో అక్కడ సామాజిక సమీకరణాలను సెట్ చేయలేకపోతున్నారని అంటున్నారు. దీంతో నరసాపురం టిడిపి జనసేన రాజకీయం గందరగోళంగా మారింది. ఏ పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నారట ఇక్కడి కాపు నేతలు. అదే జరిగితే టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విజయావకాశాలపై తీవ్రస్థాయిలో ప్రభావం ఉంటుంది. పోటీలో ఉండేది నేను కానప్పుడు ఎవరు గెలిస్తేనాకేంటి అన్నట్టుగా సాగుతున్న నరసాపురం టిడిపి రాజకీయం పై పార్టీ పెద్దలకు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు.