Leading News Portal in Telugu

Off The Record : ఏపీలో పక్క చూపులు చూస్తున్న YCP, TDP అధిష్టానాలు..! దేనికోసం..?



Tdp Ycp Otr

ఏపీలో ఇప్పుడు పక్క చూపుల పాలిటిక్స్‌ ఎక్కువయ్యాయి. అలాగని పార్టీ మారే నేతల గురించిన సబ్జెక్ట్‌ కాదు ఇది. కేవలం టీడీపీ, వైసీపీ అధిష్టానాలకు సంబంధించిన వ్యవహారం. ఎవరి ఇంటిని వాళ్లు చక్కబెట్టుకునే సంగతి ఎలా ఉన్నా… పక్కింట్లో ఏం జరుగుతుందోనని ఆరాలు తీయడం పెరిగిపోయిందట. ఇంతకీ ఏ విషయంలో రెండు పార్టీల అధిష్టానాలు ఎంక్వైరీలు చేస్తున్నాయి? దేని కోసం చూస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మే 13 ఫిక్సయింది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కసరత్తును దాదాపుగా పూర్తి చేశాయి అన్ని పార్టీలు. అలకలు, అసంతృప్తుల బుజ్జగింపుస పర్వం నడుస్తోంది. ఆ కార్యక్రమాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే… మరోవైపు ప్రచారానికి ప్లాన్‌ చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలో ఎలక్షన్‌ మేనిఫెస్టో అత్యంత కీలకంగా మారింది. ప్రచారం కోసం జనంలోకి వెళ్ళి ఏం చెప్పాలి? ఎలాంటి హామీలు ఇవ్వాలన్న విషయమై ప్రాధమిక అవగాహన ఉన్నా… వాటికో రూపం ఇచ్చి ఓట్ల వేటకు బయలుదేరాల్సి ఉంది. అందుకే మేనిఫెస్టో విడుదల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి పార్టీలు. ఆ కసరత్తు ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చేసిందని ప్రధాన పార్టీలు చెబుతున్నా… మేనిఫెస్టో విడుదలకు మీన మేషాలు ఎందుకు లెక్కిస్తున్నారన్నది బిగ్‌ క్వశ్చన్‌. ఇటు వైసీపీగానీ…. అటు కూటమి పార్టీలు గానీ… ఎందుకు ఆలస్యం చేస్తున్నాయంటూ రకరకాల గుసగుసలు నడుస్తున్నాయి ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అందుకు ఆయా పార్టీల కారణాలు మాత్రం గట్టిగానే ఉన్నాయట. ప్రస్తుతం ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రకంగా యుద్ధ వాతావరణమే ఉంది. ప్రత్యేకించి హామీల అమలు విషయంలోనైతే చెప్పే పనేలేదు. ఎవరికి వాళ్ళు పేపర్లు పట్టుకుని ప్రెస్‌ మీట్లు పెట్టి మీరేం చేశారంటే… మీరు పవర్‌లో ఉన్నప్పుడు ఏం చేశారని ఏకి పారేస్తున్న పరిస్థితి.

 

ఈ క్రమంలో మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. రెండు ప్రధాన పక్షాలు ఓ వైపు డైలాగ్‌ వార్‌ కొనసాగిస్తూనే… మరోవైపు.. పక్క పార్టీల కదలికల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాయి. 99 శాతం హామీలు అమలు చేశామని వైసీపీ అంటుంటే…అదంతా ఒట్టి మాట… అంటూ తమదైన శైలిలో లెక్కలు చెబుతున్నారు టీడీపీ లీడర్స్‌. ఇటు మ్యానిఫెస్టోలను మాయం చేసే కల్చర్ మీదే అంటూ టిడిపిని అటాక్ చేస్తోంది అధికార పక్షం. ఈ వాతావరణంలోనే ఈసారి మనం ఇచ్చే హామీలు, విడుదల చేసే మేనిఫెస్టో అవతలి వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువే ఉండాలన్నది రెండు పక్షాల అభిప్రాయంగా తెలిసింది. అమలు చేస్తామా లేదా అన్నది తర్వాతి సంగతి. ముందు చెప్పడమైతే పక్క పార్టీకంటే డాబుగా ఉండాలన్నది ఇరు పక్షాల పెద్దల అభిప్రాయంగా తెలిసింది. అందుకే ముందు ఎవరు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ప్రత్యర్ధి పార్టీ ముందుగా మ్యానిఫెస్టో రీలీజ్ చేస్తే… దానికి కౌంటర్‌గా మరికొన్ని ఆకర్షణలను జోడించి జనం ముందుకు వెళ్ళాలన్నది రెండు పక్షాల ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అందుకే పరస్పరం చూడూ… అటువైపే చూడూ… అన్నట్టుగా పక్క చూపులు చూస్తున్నాయట వైసీపీ, టీడీపీలు. మీ దగ్గర ఎలాంటి కసరత్తు జరుగుతోంది? మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటూ… ప్రత్యర్థి పార్టీల్లోని తమ సోర్సెస్‌తో ఆరాలు తీస్తున్నారట వైసీపీ, టీడీపీ ముఖ్యులు. దీంత ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో మేనిఫెస్టో విడుదల వాయిదా వేస్తున్నట్టు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల పోలింగ్‌కు ఇక 50 రోజులకు కాస్త అటుగా ఉంది సమయం. దీంతో వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు ఇక ఎన్నో రోజులు ఎదురు చూసే పరిస్థితి లేదు. దీంతో జనంలోకి దూకుడుగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రత్యర్థికంటే ముందే హామీల చిట్టాను ప్రకటించేసి ప్రచారంలో దూకాల్సిందేనంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఇంత ప్లాన్డ్‌గా, పకడ్బందీగా సిద్ధమవుతున్న మేనిఫెస్టోలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి పెరుగుతోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.