Leading News Portal in Telugu

Off The Record : టీడీపీకి అసమ్మతులు సహకరిస్తారా..?



Tdp Otr

టీడీపీకి ఇప్పుడు అతి పెద్ద సమస్య ఎదురు కానుంది. జిల్లాల్లో చాలా కాలంగా పాతుకుని పోయిన వాళ్లకు.. అతి పెద్ద కుటుంబాలకు నో టిక్కెట్‌ అని చెప్పేసింది టీడీపీ అధినాయకత్వం. ఇప్పుడిది టీడీపీ గెలుపుపై అత్యంత ప్రభావితం చూపే అంశంగా కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. అసంతృప్తులను బుజ్జగించేస్తామనే ధీమాతో టీడీపీ హైకమాండ్‌ కన్పిస్తోన్నా.. అంసతృప్తులు ఎంత వరకు లైన్లోకి వస్తారోననేది డౌటుగానే కన్పిస్తోంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించే అంశంపై మరోసారి సీరియస్‌గా ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఉందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోందట.

తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కసరత్తు చేసింది. రెగ్యులర్‌ ఫార్మాట్‌కు భిన్నంగా వ్యవహరించింది. చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించేసింది. కొందరి విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. వీళ్లు లేకుండా ఎన్నికలు జరగవు అని అందరూ అనుకునే కొన్ని కుటుంబాలను దూరంగా జరిపేసింది. ఇంకొన్ని చోట్ల టిక్కెటు మీద ఆశలు పెట్టుకున్న వారికి పక్కన పెట్టేసింది. టీడీపీ నాయకత్వం చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత…ఈ స్థాయిలో నిర్ణయాలు.. ఇంతటి కీలక పరిణామాలు మొదటి సారి చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి ఎవరి సహకారం ఎంత వరకు ఉంటుందోననే అనుమానంగా మారిందట. పైకి చాలా మంది దారికి వచ్చినట్టు కన్పిస్తున్నా.. లోలోపలే రగిలిపోతున్నారనే టాక్‌ నడుస్తోంది. దీంతో ఈ అసమ్మతి ఎఫెక్ట్‌ పార్టీ మీద ఏ మేరకు పడుతోందనే భయం వెంటాడుతోందట.

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కుటుంబాలను ఈసారి ఎన్నికల్లో పక్కన పెట్టడమో.. లేక వారికి ప్రాధాన్యత తగ్గించడమో జరుగుతూనే ఉంది. వీటిల్లో ప్రధానంగా దేవినేని, కొడెల కుటుంబాల గురించి చెప్పుకోవాలి. ఈ రెండు కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఎన్నికలు జరగలేదు. ఇప్పుడా పరిస్థితి కన్పించడం లేదు. 41 ఏళ్ల చరిత్రలో కృష్ణా జిల్లాలో దేవినేని కుటుంబానికి టిక్కెట్‌ లేకుండా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. మైలవరం నుంచి టిక్కెట్‌ ఆశించిన దేవినేని ఉమకు టిక్కెట్‌ దక్కలేదు. గుంటూరు జిల్లాలో కోడెల కుటుంబానిది కూడా సేమ్‌ సీన్. గత ఎన్నికల వరకు కోడెల హవా గుంటూరు జిల్లా టీడీపీలో నడిచింది. రాజకీయాల నుంచి కోడెల ఫ్యామిలీని పక్కకు పెట్టేశారు. మధ్యలో పార్టీని వీడి వెళ్లి వచ్చినా…కళా వెంకట్రావు కూడా చంద్రబాబుకు నమ్మిన బంటులానే ఉన్నారు. కళాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇస్తే చీపురుపల్లి లేదా.. పక్కకు తప్పుకోమనే రీతిలో కళా పరిస్థితి తయారైంది.

ప్రతి జిల్లాలోనూ అసంతృప్తులు.. అసమ్మతి రాగం ఆలపించేవారు.. చిన్నగానో.. పెద్దగానో తారసపడుతూనే ఉన్నారట. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవమ్మను పక్కన పెట్టేయడంతో అసంతృప్తితో కేడర్‌ రగిలిపోతోంది. పాతపట్నం టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. అటు విజయనగరం జిల్లాలో కేఏ నాయుడు, కిమిడి కుటుంబం, కర్రోతు బంగార్రాజు నిరాశతో ఉన్నారు. వీరిలో పార్టీకి సహకరించేది ఎవరు.. ఎంత వరకు సహకారం ఉంటుందనేది డౌటుగానే కన్పిస్తోంది. ఇక విశాఖ సీనియర్‌ లీడర్‌ బండారు సత్యనారాయణ మూర్తికి ఈ దఫా టిక్కెట్‌ దక్కలేదు. అలాగే మాడుగుల నుంచి టిక్కెట్‌ ఆశించిన రామానాయుడు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి పిల్లి అనంతలక్ష్మి, వర్మ బ్యాచ్‌, బొడ్డు వంటి సహకారం ఎంత మేరకు ఉంటుందో చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో గన్ని వీరాంజనేయులు రాజీపడ్డట్టు కన్పించినా…ఆ ఫలితం ఎన్నికల్లో కన్పిస్తుందా..? లేదా అనేది చూడాల్సి ఉంటుంది. గోపాలపురం టిక్కెట్‌ మద్దిపాటి వెంకటరాజుకు దక్కలేదు. దీంతో ముళ్లపూడి బాపిరాజు కచ్చితంగా టీడీపీ అభ్యర్థి ఓటమికి పని చేసేలా కన్పిస్తున్నారు. అలకతో ఉన్న కెఎస్‌ జవహర్, పీతల సుజాత, కలవపూడి శివ ఎఫెక్ట్‌ ఏ మేరకు ఉంటుందోనని పార్టీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు దక్కించుకోలేని దేవినేని ఉమ, బొమ్మసాని, దేవదత్‌, బుద్దా, జలీల్‌, బుద్ద ప్రసాద్‌, వేదవ్యాస్‌ సహకారం ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా, కొమ్మాళ్లపాటి శ్రీధర్‌కు టిక్కెట్లు దక్కలేదు. దీంతో వీరి మద్దతు ఎంత వరకు పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు ఉంటుందనేది డౌటుగానే కన్పిస్తోంది. కందుకూరు టిక్కెట్‌ ఆశించిన ఇంటూరి రాజేష్‌ అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఇండిపెండెంటుగా నిలబడతానంటున్నారు. కోవూరులో పోలంరెడ్డి ఫ్యామిలీ దారికి వచ్చినట్టు కన్పించినా…ఫీల్డ్‌లో సహకరిస్తారా అన్నది అనుమానంగా ఉంది. ధర్మవరం టిక్కెట్ దక్కించుకోలేకపోయిన పరిటాల శ్రీరాం, అనంత టికెట్ ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరి, అనంత లోక్‌సభ స్థానం దక్కించుకోలేకపోయిన జేసీ పవన్‌ రెడ్డి, టిక్కెట్లు ఆశించి భంగపడ్డ తిప్పేస్వామి, హనుమంతరాయ చౌదరి, ఉమా మహేశ్వర నాయుడు, జితేంద్ర గౌడ్‌ అలకబూనారు. చిత్తూరు జిల్లాలో వివిధ సెగ్మెంట్లల్లో ఆశావహులుగా సుగుణమ్మ, శంకర్‌ యాదవ్‌, హెలెన్‌ నిరాశతో ఉన్నారట. కర్నూలు జిల్లాలో తిక్కారెడ్డి, సుబ్బారెడ్డి, మీనాక్షి నాయుడు ఎంత వరకు దారికి వస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రొద్దుటూరు టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ప్రవీణ్ రెడ్డిది అదే పరిస్థితి. జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలని భావించిన భూపేష్‌ రెడ్డి వంటి వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీరిలో చాలా మందికి దారికి వచ్చినట్టు కన్పించినా.. ఎన్నికల నాటికి వీరి నుంచి సహకారం ఎంత వరకు ఉంటుందనేది అనుమానంగానే ఉంది.