
ఆ జిల్లాలో బిజెపికి అసెంబ్లీ టికెట్లు నిల్…ఒక్క ఎంపీ సీటయినా దక్కుతుందా ? బిజెపికి ఇస్తే అభ్యర్థి ఎవరు ? పురంధరేశ్వరికి ఇస్తారా ? సోము వీర్రాజుకు ఎసరు పెడతారా ? ఎంపీ టికెట్ ఆశించిన నేతలకు నిరాశ తప్పలేదా ? పురందేశ్వరికి ఇస్తే సోము వీర్రాజుతో పాటు టీడీపీ నేతలు సహకరిస్తారా ? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బిజెపికి షాక్ తగిలింది. 19 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో బిజెపికి ఒక్క సీటు కూడా దక్కలేదు. టిడిపి 14 స్థానాల్లో పోటీ చేస్తుంటే…జనసేన ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో బిజెపికి రాజమండ్రి పార్లమెంట్ టికెట్ అయినా దక్కుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాకినాడ సీటు జనసేనకు కేటాయిస్తే…అమలాపురం ఎంపీ టిక్కెట్ టిడిపి తీసుకుంది. మిగిలిన రాజమండ్రి పార్లమెంట్ టికెట్ బిజెపికి ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బిజెపికి టికెట్ ఇస్తే అభ్యర్థి ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరి బరిలో దిగితే…అదే టికెట్ ఆశిస్తున్న రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు టికెట్ లేనట్టేనన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రి… వీర్రాజు సొంత నియోజకవర్గం. తొలి నుంచి బీజేపీలో ఉన్న నేత. ఒంగోలుకు చెందిన పురందేశ్వరి…2014 ఎన్నికలకు ముందు వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక్కడి నుంచి పురందేశ్వరికి టికెట్ ఖరారైనట్టేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తొలినుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సోము వీర్రాజును కాదని పురందేశ్వరికి టికెట్ ఏలా ఇస్తారని… సొంత పార్టీ నేతల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
పురందేశ్వరి కోసం తమను బలి చేస్తారా ? అంటూ మరోవైపు టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో…టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు లేకపోవడంపై ఆ వర్గం నేతలు లోలోపల రగిలిపోతున్నారట. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన బొడ్డుకు.. ఇప్పుడు బీజేపీ కోసం ఎంపీ స్థానం వదుకోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొందట. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే అదీ దక్కే అవకాశం కనిపించకపోవడంతో…బొడ్డు వర్గం టీడీపీ అధినేతపై మండిపడుతోంది. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని సన్నిహితుల వద్ద బొడ్డు వాపోతున్నారట. పురందేరేశ్వరికి రాజమండ్రి టికెట్ కన్ఫామ్ చేస్తే…సొంత పార్టీలోనే అసమ్మతి తప్పేలా లేదు. సోము వీర్రాజు వర్గం పురందేశ్వరికి ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. టిడిపిలోనూ ఇదే పరిస్థితి నెలకొందట. పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, గన్ని కృష్ణ వంటి నేతలు…బిజెపికి టిక్కెట్ కేటాయింపుపై గుర్రుగా ఉన్నారట. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఐదు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు, రెండు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులను కలుపుకుని బిజెపి ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోము వీర్రాజుతోపాటు టీడీపీ తరపున టికెట్ ఆశించిన నేతలు పురందేశ్వరికి ఎలా సహకరిస్తారా ? లేదంటే వ్యతిరేకంగా పని చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.