Leading News Portal in Telugu

Chandrababu: ఖరారు చేయాల్సిన ఎంపీ సీట్లపై టీడీపీ కసరత్తు.. వారికే ఛాన్స్..!



Chandrababu

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఇంకా ఖరారు చేయాల్సిన ఎంపీ సీట్లపై కసరత్తు చేస్తోంది.. జనసేన-టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని కీలక స్థానాలు కోల్పోయిన ఆ పార్టీ.. ఓ వైపు నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు.. పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఎక్సైజ్‌ చేస్తోంది.. విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేయనుంది టీడీపీ.

ఈ నేపథ్యంలో.. విజయనగరం లోక్ సభ స్థానం తూర్పు కాపులకు కేటాయించే అవకాశం ఉంది.. శ్రీకాకుళం, అనకాపల్లి స్ఖానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయించిన టీడీపీ, బీజేపీ. విశాఖ టీడీపీ తరపున బరిలో నిలవనున్నారు కమ్మ సామాజిక వర్గ అభ్యర్థి భరత్… విజయనగరం పరిధిలో రెండు లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు ఉండగా.. విజయనగరం సీటు తూర్పు కాపులకి తప్పదని భావిస్తున్నారు చంద్రబాబు. తెర మీదకు కళా, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు వస్తున్నాయట.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరును కూడా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, ఒంగోలు, కడప పార్లమెంట్లలో రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ ఉండనుండగా.. అనంతపురం పార్లమెంట్ నుంచి బీసీకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.. మొత్తంగా ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయా స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.