Leading News Portal in Telugu

Off The Record : ఎమ్మెల్యే ఎలిజా దెబ్బకు వైసీపీ, టీడీపీ ఉక్కిరిబిక్కిరి



Otr Eliza

అత్త తిట్టినందుకు కాదు…. తోటి కోడలు నవ్వినందుకు నా బాధ అన్నట్టుగా ఉందట ఆ ఎమ్మెల్యే వ్యవహారం. సిట్టింగ్‌నైనా పార్టీ టిక్కెట్‌ ఇవ్వనందుకు బాధ లేదుగానీ… కొత్త అభ్యర్థి పూచిక పుల్లతో సమానంగా తీసిపారేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని అంటున్నారాయన. ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయంతో నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏం చేశారాయన? చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా…. ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌ పార్టీలోకి ఎందుకు జంప్‌ అయ్యారన్నది నియోజకవర్గంలో హాట్‌ హాట్‌ సబ్జెక్ట్‌. గత ఎన్నికల్లో వైసీపీ తరపున భారీ మెజారిటీతో గెలిచిన ఎలిజా అనూహ్య నిర్ణయంతో ఇప్పుడు చింతలపూడిలో ట్రయాంగిల్‌ ఫైట్‌ గట్టిగానే ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. వైసీపీ అమలాపురం ఎంపీగా అవకాశం ఇచ్చినా… వద్దన్న ఎలీజా ముందు వైసీపీలోనే కామ్‌గా ఉన్నారు. అయితే టైమ్‌ గడిచేకొద్దీ కొత్త నేతల అత్యుత్సాహాన్ని తట్టుకోలేక ఆయన పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారన్న చర్చ నడుస్తోంది. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా… పట్టించుకోకుండా కొత్త అభ్యర్థితో శంకుస్థాపనలు చేయించడం, ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేసిన రోడ్లను కొత్త అభ్యర్థి విజయరాజు ప్రారంభించడం వంటి వ్యవహారాలతో నిసిగిపోయారట ఆయన. పైగా  శిలాఫలకాల మీదున్న ఎమ్మెల్యే పేరు, బొమ్మలు  చెరిపేసి అవమానాలకు గురిచేయడంతో డీప్‌గా హర్టయ్యారట ఎలీజా. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్న తీరును పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీ మారక తప్పలేదంటున్నారు ఆయన అనుచరులు.

నియోజకవర్గ వైసీపీలో ఉన్న వారంతా కోవర్టులు కావడంతోటే తాను పార్టీ వీడాల్సి వస్తోందని, తనకు జరుగుతున్న అవమానాలపై పార్టీ పెద్దలు స్పందించకపోవడాన్ని మరింత అవమానంగా భావించానని, అందుకే కాంగ్రెస్‌ వైపునకు వెళ్తున్నానని సన్నిహితుల దగ్గర వాపోయారట ఎమ్మెల్యే.ప్రస్తుతం చింతలపూడిలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోతగ్గ నాయకుడు లేడు. ఎలీజా రాకతో పార్టీ పుంజుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో చింతలపూడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సై అంటున్నారాయన. ఈ నిర్ణయంతో ఇపుడు టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైందని అంటున్నారు. ఐదేళ్లపాటు ఎమ్మెల్యే గా ఉన్న ఎలిజా స్థానికంగా పట్టున్న నాయకుడిగా ఎదిగారు. వైసీపీలో ఎక్కువ శాతం నాయకులు ప్రస్తుతానికి ఆయనవైపే ఉన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి రిజర్వ్‌డ్‌ స్థానంలో పోటీ కాబట్టి ఓట్ల చీలిక భారీగా ఉండవచ్చంటున్నారు. వైసీపీ నుంచి దాదాపు 220రోజులు గడప గడపకు వెళ్లిన అనుభవం ఇపుడు కలిసొచ్చే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క చింతలపూడి టీడీపీ నుంచి సీటు ఆశించిన వారు ఎక్కువగానే ఉన్నారు. అలా టిక్కెట్‌రాక నిరాశతో ఉన్న నాయకులు తమకు ఇష్టంలేని పార్టీ అభ్యర్థికి సహకరించేకంటే… ఎలీజావైపు ఉండటం బెటర్‌ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తులు, టిడిపిలోని అసంతృప్తులు కలిసి ఇప్పుడు కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే సమీకరణలు మారిపోవచ్చంటున్నారు. చింతలపూడి వైసిపిలో ఎంపీ కోటగిరి వర్గంతో పాటు మరో వర్గం ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఎలీజా బయటికి వెళ్లడం వైసిపిని మరింత ఇబ్బందిపెట్టే అంశం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో…ఇంతకాలం అవమానాలు ఎదురవుతున్నాయన్నా పట్టించుకోని వైసీపీ పెద్దలు ఇప్పుడు డ్యామేజ్ ని ఏ రకంగా కంట్రోల్‌ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.