Leading News Portal in Telugu

Off The Record: పవన్‌ కల్యాణ్ టార్గెట్‌గా ముద్రగడ అడుగులు?



Otr Mudragada

Off The Record: అర్జునుడి గురి పక్షి కన్ను మీద మాత్రమే ఉన్నట్టుగా… ఆ సీనియర్‌ లీడర్‌ టార్గెట్‌ ఒకే ఒక్క వీఐపీ నియోజకవర్గమా? ఏపీలో ఎక్కువ ఓటింగ్‌ ఉన్న ఓ పెద్ద సామాజికవర్గాన్నే ప్రభావితం చేయగలనని అనుకుంటున్న ఆ నాయకుడిని ఒక్క నియోజకవర్గానికే ఎందుకు పరిమితం చేశారు? అసలు వైసీపీ ఆ సెగ్మెంట్‌ కోసమే… ఆయన్ని పార్టీలోకి తీసుకుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా లీడర్‌?

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత నుంచి వైసీపీ నాయకుడిగా మారి పది రోజులు దాటింది. ఈనెల 15న పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిపోయారాయన. ఫ్యాన్‌ కిందకి చేరినప్పటి నుంచి ఇక తగ్గేదేలే అంటున్నారట ముద్రగడ. నా టార్గెట్ పిఠాపురం… నేను ఫిక్స్ అయిపోయాను… అలా ఫిక్సయినవారే నా దగ్గరికి రండంటూ సన్నిహితులకు సందేశాలు పంపుతున్నట్టు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గ వైసిపి నేతలతో పాటు మండలాల వారీగా కాపు ప్రముఖులతో కూడా మీటింగ్స్‌ పెడుతూ గేరప్‌ చేస్తున్నారు. పార్టీలో చేరిన డే వన్‌ నుంచే ముద్రగడ అంత దూకుడుగా ఎందుకు ఉన్నారంటే… అధిష్టానం ఇచ్చిన టాస్కే కారణం అన్నది సన్నిహితుల సమాచారం. పిఠాపురంలో ఈసారి కూడా వైసీపీ జెండా ఎగిరి తీరాలని వైసీపీ పెద్దలు ఆయనకు దిశానిర్దేశం చేశారట. ఇక్కడ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తుండటంతో స్పెషల్‌ కేస్‌గా పరిగణిస్తున్నారు పార్టీ పెద్దలు. ఈ నియోజకవర్గంలో మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాలు, పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడున్న ఓట్లలో సాలిడ్ గా వైసీపీకి పడేవి ఎన్ని, కాస్త వర్కౌట్‌ చేస్తే వచ్చేవి ఎన్నంటూ ఆరాలు తీస్తున్నారట.

ముద్రగడ పద్మనాభం 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓడిపోయారు. నాడు మూడో స్థానం ఆయనది. దీంతో అప్పటికి, ఇప్పటికి మారిన పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు పద్మనాభం. 2009లో ఈ నియోజకవర్గాన్ని పీఆర్పీ గెల్చుకుంది. ఆ బలం సంగతేంటి? అది ఇప్పుడు జనసేనకు ఉపయోగపడుతుందా? అంటూ వివిధ కోణాల్లో సమాచారం తెప్పించుకుని విశ్లేషించే పనిలో ఉన్నారట ముద్రగడ. ఎవరి స్థాయిలో వారు సీరియస్‌గా పనిచేస్తే పవన్‌ని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదని కేడర్‌కు హితబోధలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా కాపు ఓట్లు ఉండటం, పోలింగ్‌కు చాలా టైం మిగలడంతో అవసరమైతే గ్రామాల వారీగా ఆ సామాజికవర్గ సమావేశాలు పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. గతంలో తనతో పని చేసిన నేతలను కలిసి కుశల ప్రశ్నలు అడుగుతున్నారట ఈ మాజీ మంత్రి. 2009లో చేసిన తప్పును మళ్ళీ చేయొద్దని, ఈసారి తాను మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించాలని అందరికీ ఫోన్లు చేసి అడుగుతున్నారాయన.. వైసీపీ కూడా పిఠాపురం బాధ్యతలు పూర్తిగా తనకే అప్పగిస్తుందని, దానికి తగ్గట్లుగా ట్యూన్ అవ్వాలంటూ కేవలం ఈ నియోజకవర్గం టార్గెట్‌గానే రాజకీయం చేస్తున్నారాయన.