
Off The Record: బీజేపీ సీనియర్ లీడర్ సుజనా చౌదరి పేరు అనూహ్యంగా అసెంబ్లీ బరిలోకి ఎందుకు వచ్చింది? ఎప్పుడూ ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే సుజనా… బెజవాడ గల్లీకి రావడానికి కారణాలేంటి? తెర వెనక జరిగిన స్టోరీ ఏంటి? బయట జరుగుతున్న ప్రచారంలో నిజానిజాల సంగతేంది? అంతా మేడం మంత్రాంగమన్న వాదనలో నిజమెంత?
ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సుజనా చౌదరి. 2014 ఎన్నికల టైంలో ఎన్డీఏలో ఉన్న టీడీపీ నాటి కేంద్ర సర్కార్‌లో భాగస్వామి అయింది. పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుతో పాటు.. అప్పుడు టీడీపీలో ఉన్న సుజనా చౌదరి కూడా రాజ్యసభ సభ్యుడి హోదాలో కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరారాయన. అక్కడ కూడా ఏపీ విషయంలో యాక్టివ్ రోల్ పోషించారు. అయితే… ఈసారి యాక్టివ్ ఎలక్షన్ పాలిటిక్స్‌లోకి రావాలని అనుకున్నారట ఆయన. విజయవాడ లేదా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి మళ్లీ పార్లమెంట్ మెట్లు ఎక్కాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ.. తీరా సీట్ల ప్రకటన టైం వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. లోక్‌సభకు వెళ్లాలని భావించిన సుజనా.. అసెంబ్లీకి పోటీ పడాల్సి వస్తోంది. విజయవాడ పార్లమెంట్‌కు పోటీ చేయాలనుకున్నా…. ఆ పరిధిలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగుతున్నట్టు చెబుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాకున్నా.. దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ పాలిటిక్స్ చేయాలనుకున్న సుజనాను.. గల్లీకి పరిమితమయ్యేలా చేసిందెవరన్న క్వశ్చన్‌కు సమాధానాలు వెదుకుతున్నారు రాజకీయ పరిశీలకులు.
సీనియర్లు అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో పార్టీ పెద్దలే ఈ తరహా సూచన చేశారనేది ఓ చర్చ. ప్రతి ఒక్కరూ ఎంపీ అంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే… అసలు ఏపీలో పార్టీని బలోపేతం చేసేవాళ్లు ఉండరనేది బీజేపీ హైకమాండ్ భావనగా కన్పిస్తోంది. దీంతో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల్లో కొంత సీరియస్ నెస్ తీసుకురావాలన్నా… అసెంబ్లీ సీట్ల విషయంలోనూ బీజేపీ సీరియస్‌గా ఉందనే భావన ప్రజల్లో కలగచేయాలన్నా.. సీనియర్లు అసెంబ్లీకి వెళ్లడమే కరెక్ట్ అనే చర్చ పార్టీ హైకమాండ్ వద్ద జరిగినట్టు బీజేపీలో టాక్. దీనికి అనుగుణంగానే సోము వీర్రాజు, సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, సత్య కుమార్, ఆదినారాయణరెడ్డి లాంటి నేతలు అసెంబ్లీ బరిలోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. పోటీ చేసే పది లేదా పదకొండు స్థానాల్లో ఆరుగురే…. ఫేస్ వాల్యూ ఉన్నవారు. ఇలాంటి వాళ్ళు అశెంబ్లీ బరిలోకి వస్తే.. టీడీపీ, జనసేన నుంచి ఓట్ ట్రాన్సఫర్ తేలిగ్గా అవుతుందన్నది పార్టీ పెద్దల ఆలోచనగా తెలిసింది. అయితే ఇదే సమయంలో మరో చర్చా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్‌కు అంత ఆలోచన కానీ.. ఇంతటి దూరదృష్టి కానీ లేదనేది కొందరి మాట. ఇదంతా మేడమ్ మంత్రాంగమేనన్నది వారి అభిప్రాయం. ఎన్‌డీఏ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్న టైంలో… ఢిల్లీ కోటలో పాగా వేసేందుకు పురందేశ్వరి అద్భుతమైన గూగ్లీతో పార్టీలోని సీనియర్లను క్లీన్ బౌల్డ్ చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్‌కు పంపుతున్నారన్న మాట వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే.. ఏపీ నుంచి కేంద్ర కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే చర్చ జరిగినప్పుడు.. తాను తప్ప.. మరే ఇతర సీనియర్ రేసులో లేకుండా చూసుకునే వ్యూహంలో భాగంగానే పురందేశ్వరి ఈ తరహా వ్యూహంతో సీనియర్లను సైడ్ చేసేశారనేది పార్టీలో లేటెస్ట్ టాక్. జీవీఎల్, సోము వీర్రాజు వంటి సీనియర్స్‌లో జీవీఎల్‌కు టిక్కెట్ లేకుండా పోయింది. ఇక సోమును అశెంబ్లీకి పంపాలనే ప్రతిపాదనతో సైడ్ చేశారనేది పురందేశ్వరి మీద వస్తున్న విమర్శ. ఇదే తరహాలో సుజనా మీద కూడా ఢిల్లీ వ్యూహం పనిచేసిందన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. మిగిలిన నేతలతో పోల్చుకుంటే కేంద్రంలో మంచి సంబంధాలు ఉండడం.. గతంలో మోడీ కేబినెట్‌లో పని చేయడంలాంటివి సుజనాకు కలిసి వచ్చే అంశాలు. దీంతో ఆయన అసలు రేసులో లేకుండా చేయాలంటే అసెంబ్లీకి పంపడమే సరైన మార్గమనే పక్కా ప్రణాళికతో పురందేశ్వరి స్కెచ్ వేశారన్నది బీజేపీ ఇన్‌సైడ్ టాక్. అయితే… అది కరెక్ట్ కాదని.. అధిష్టానమే పూర్తి స్థాయిలో ఆలోచించిందనే వారు సైతం లేకపోలేదు. అన్ని రకాలుగా ఆలోచించే అధిష్టానం.. పురందేశ్వరి చెప్పినట్టు ఎందుకు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు ఆ వాదనను సమర్థిస్తున్నవారు. టిక్కెట్ల విషయంలో కానీ.. సీట్ల సర్దుబాటులోగానీ ఆమె ప్రమేయం ఎంత మాత్రం ఉండబోదని వాదిస్తున్నారు. ఇక కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చి ఒకవేళ కేంద్ర మంత్రిగా తీసుకోవాలంటే పురందేశ్వరినే ఎందుకు తీసుకుంటారన్నది కూడా మరో క్వశ్చన్. లాబీయింగ్ చేసుకోగల స్థాయి ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారని, సుజనా చౌదరిని పురందేశ్వరే కావాలని తప్పించారంటే నమ్మలేమన్న వాదన సైతం పార్టీలో ఉంది. ఇందులో వాస్తవావాస్తవాల సంగతి ఎలా ఉన్నా… అంతర్గతంగా ఏదో జరిగిపోయిందన్న అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఇన్‌సైడ్ మేటర్స్ తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.