Leading News Portal in Telugu

Off The Record : అచ్చెన్నాయుడు దెబ్బకు ఉత్తరాంధ్రలో టీడీపీ డీలాపడినట్టేనా..?



Otr Atchannaidu

తెలుగుదేశం ఆంధ్రా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏకంగా పార్టీని పడుకోబెట్టేస్తున్నారా? గెలుపు ఊపు వచ్చిన ఉత్తరాంధ్రలో ఇప్పుడు నెగెటివ్‌ టాక్‌ ఎందుకు మొదలైంది? కనీసం పాతిక సీట్లకు తగ్గవని గొప్పగా చెప్పుకున్న చోట ఇప్పుడు నమ్మకం ఎందుకు సడలింది? పార్టీ నిర్ణయాలు బూమరాంగ్‌ అవుతున్నాయా? అసలిప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి బలం ఉన్న ఏరియాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. మూడు రాజధానుల ఎపిసోడ్‌తో.. విశాఖను రాజధానిగా ప్రకటించినా.. వైసీపీ ఇక్కడ పట్టు సాధించలేకపోతోందన్నది ఒక పొలిటికల్ పరిశీలన. ఆ ఊపుతోనే.. ఈసారి ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం 34 స్థానాలకు గానూ.. 25 నుంచి 27 సీట్లకు తగ్గకుండా గెలుస్తామంటూ గతంలో లెక్కలుగట్టారు టీడీపీ నేతలు. ఉత్తరాంధ్రలో తమ పార్టీ మాంఛి జోష్‌ మీదుందని, తక్కువలో తక్కువ 25 స్థానాలైతే గెలుస్తామని నాడు ఢంకాబజాయించారు. కానీ ఇప్పుడు… తీరా ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి ఆ ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ కనిపించడం లేద్నన మాట టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తాము పాతిక సీట్లు గెల్చుకునే సంగతి పక్కనబెడితే…ఇప్పుడు మెజార్టీ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు పెరుగుతున్నాయన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోందట. అలా ఎందుకు? ఇంతలోనే అంత మార్పు ఎందుకంటే…. అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఘోరమైన తప్పిదాలేనన్నది పార్టీ నేతల ఫైనల్‌ ఆన్సర్‌. అందుకు బాధ్యులు ఎవరంటే… పార్టీలోని ఎక్కువ మంది నేతల వేళ్ళు అచ్చెన్నాయుడు వైపు మళ్లుతున్నాయన్నది ఉంటర్నల్‌ టాక్‌. పార్టీ ప్రయోజనాలు గెలుపు గుర్రాల సోయి లేకుండా… తనకు అనుకూలంగా ఉండే వాళ్లకే టిక్కెట్లు ఇప్పించుకోవడంలో అచ్చెన్న సక్సెస్‌ అయ్యారని, దాని పర్యవసానంగానే ఉత్తరాంధ్రలో గట్టి ఝట్కా తగిలే ప్రమాదం కన్పిస్తోందన్నది టీడీపీ వర్గాల ఆందోళనగా తెలిసింది. ఓ విధంగా చెప్పాలంటే కోతకు సిద్ధంగా ఉన్న పంట మీద మదపుటేనుగుల మందపడి తొక్కిపెట్టి నాశనం చేసినట్టుగా ఉందని పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు తన వర్గాన్ని కాపాడుకునేందుకు పార్టీనే పణంగా పెట్టేశారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

శ్రీకాకుళం సెగ్మెంట్‌ నుంచి సీనియర్‌ అయిన గుండా లక్ష్మీదేవమ్మకు టిక్కెట్‌ దక్కకుండా గొండు శంకర్‌ను తెర మీదకు తెచ్చారు. అందుకు అచ్చెన్నే కారణమని లక్ష్మీదేవమ్మ అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు గెలుపు గ్యారంటీ అనుకున్న ఆ సీటు ఇప్పుడు డైలమాలో పడిందన్నది పార్టీ వర్గాల టాక్‌. అర్బన్‌ ప్రాంతంలో టీడీపీకి ఓటర్లు సహకరిస్తే తప్ప గొండు శంకర్‌ గట్టెక్కడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. ఇక పాతపట్నం టిక్కెట్‌ దక్కించుకోలేకపోయిన కలమట అయితే నేరుగా అచ్చెన్నాయుడును టార్గెట్‌ చేసుకునే ప్రచారం మొదలుపెట్టేశారు. తాను నిర్వహిస్తున్న రోడ్‌ షోలలో అచ్చెన్నాయుడు, కూన రవి మీద అదే పనిగా విమర్శలు చేసేస్తున్నారు కలమట. చంద్రబాబును వీరిద్దరే పక్క దోవ పట్టించారన్నది ఆయన ఆరోపణ. అచ్చెన్నాయుడు సర్వేలను కూడా ట్యాంపర్‌ చేసేసి తప్పుడు నివేదికలు పంపి.. తన అనుచరుడైన మామిడి గోవిందరావుకు టిక్కెట్‌ ఇప్పించుకున్నారని అంటున్నారు కలమట వెంకటరమణ. అందులో వాస్తవం లేకపోలేదనేది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. ఇక ఎచ్చెర్ల టిక్కెట్‌ ఆశించిన కళా వెంకట్రావుకు ఆ స్థానం దక్కకుండా చేయడంలో అచ్చెన్న సక్సెస్‌ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ముందు నుంచి తాను అనుకున్న విధంగా కళాను చీపురుపల్లికి పంపగలిగారని అంటున్నారు. ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా కలిశెట్టి అప్పలనాయుడును తయారు చేయడమే కాకుండా.. అతనికి ఏకంగా విజయనగరం ఎంపీ టిక్కెట్‌ వచ్చేలా చక్రం తిప్పారని గుసగుసలాడుకుంటున్నారు టీడీపీ నేతలు. విజయనగరం లాంటి టిక్కెట్‌ ఇచ్చే ముందు ఎవరిని నిలబెట్టాలి..? సమీకరణలు ఎలా ఉన్నాయన్న కనీసం ఆలోచన చేయకుండా.. ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే… ప్రత్యర్థి పార్టీలకు పని సులువు కాదా..? అన్నది పార్టీ వర్గాల క్వశ్చన్‌. ఈ విషయంలో కూడా పార్టీని అచ్చెన్నే పక్కదారి పట్టించారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇక పాలకొండలో చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న నిమ్మక జయకృష్ణకు కాకుండా.. ఆ స్థానం జనసేనకు వెళ్లేలా తెర వెనుక పాత్ర పోషించి.. నిమ్మకకు చెక్‌ పెట్టడంలో అచ్చెన్న సస్కెస్‌ అయ్యారన్న చర్చ జరుగుతోందట పార్టీలో. కురుపాం సెగ్మెంట్‌లో కూడా స్థానికంగా ఉన్న ఐదు గ్రూపులకు చెందిన నేతలు ఓ మాట మీదకు వచ్చి.. లావణ్య అనే నేతను అభ్యర్థిగా ప్రపోజ్‌ చేస్తే.. ఆమెను కాదని.. శత్రుచర్ల విజయరామరాజు వర్గానికి చెందిన తొయ్యకకు టిక్కెట్‌ ఇప్పించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే గెలుపు అవకాశాల్ని తగ్గించేశాని అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నారు. ఇక ఎస్‌ కోటలో అసంతృప్తులను రాజేయడంలోనూ అదృశ్య హస్తం ఉండనే ఉందట.ఓ పక్క ఇంత చేసినా… ఆయన తాను ఏరికోరి ఖరారు చేసిన అభ్యర్థుల గెలుపు కోసం పని చేయడమో.. లేదా.. అసంతృప్తులను చల్లార్చడమో చేస్తున్నారా..? అంటే అదీ కన్పించడం లేదన్నది పార్టీ టాక్‌. ఇవి పైకి కొన్ని సెగ్మెంట్లుగానే కన్పిస్తోన్నప్పటికీ.. ఈ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాల మీద కూడా పడుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో కొంత క్లారిటీ ఉన్న సెగ్మెంట్లల్లో కూడా నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవుతోందట. ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలోని చాలా సెగ్మెంట్లల్లో వైసీపీ పైచేయి సాధిస్తుందనే చర్చ మొదలైనట్టు టీడీపీ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. పార్టీకి కంచుకోటలాంటి ఇచ్చాపురం సెగ్మెంట్‌ కూడా ఇప్పుడు టైట్‌లో పడిందనే చర్చ జరుగుతోందంటే అందుకు కారణం అచ్చెన్న వ్యవహార శైలేనన్నది టీడీపీ ఇంటర్నల్‌ టాక్‌. అయితే కొంతలో కొంత ఊరటగా… ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్టీ సెగ్మెంట్లు మినహా.. మిగిలిన చోట్ల ఆశాజనకంగా ఉన్నామంటున్నారు టీడీపీ నేతలు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నెగెటివ్‌ ఎఫెక్ట్‌ విశాఖ వరకు రాకపోవడమే రిలీఫ్‌ అంటున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆపరేషన్‌ ఉత్తరాంధ్రను చేపట్టకుంటే… పరోక్షంగా తగిలే దెబ్బలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయమన్న భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.