Leading News Portal in Telugu

Kakarla Suresh: ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం



Kakarla Suresh

Udayagiri Politics: సమిష్టిగా కృషిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి మండల కేంద్రంలోని కళ్యాణ మండపం నందు సీతారాంపురం ఉదయగిరి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశంతో పాటు పరిచయ కార్యక్రమాన్ని ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, సీతారాంపురం మండల కన్వీనర్ ప్రభాకర్ రాజులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది కలయికతో కూడిన పార్టీలలో విభేదాలు సహజమని వాటిని పక్కన పెట్టి పార్టీ విజయానికి కష్టపడాలన్నారు. పార్టీలు వేరు వ్యక్తిగతం వేరు అని వ్యక్తిగతాన్ని పార్టీకి రుద్దవద్దని తెలిపారు. చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ప్రతి మండలంలో ఐదు మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా విభేదాల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే మేం కూడా రంగంలోకి దిగుతామన్నారు. కలిసికట్టుగా పనిచేసి తెలుగు దేశాన్ని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. నెల్లూరు ఎంపీగా తనను, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను గెలిపించాలని ప్రార్థించారు.

తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం: కాకర్ల సురేష్
ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం వద్దని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1982 నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి సైనికుడిని తాను గుర్తించి వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. సైనికుల కష్టం వల్లనే తాము ఇక్కడ ఉన్నామని మీరు లేకపోతే మేము లేమన్నారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయానికి కష్టపడాలన్నారు. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దానికి కావాల్సిన వనరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయని అవసరమైన వారు వచ్చి తీసుకువెళ్లారన్నారు. బూత్ కన్వీనర్‌లు కష్టపడి పని చేయాలన్నారు. నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తకి ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. కచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలవాలని గెలిస్తేనే మెట్ట ప్రాంతంమైన ఉదయగిరి బాగుపడుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇద్దరు కలిస్తేనే గెలుపు నలుగురు కలిశాం, మెజారిటీ రావాలి: కంభం విజయరామిరెడ్డి
అత్యంత చైతన్య కలిగిన ఉదయగిరి నియోజకవర్గంలో 2024 మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో గెలవబోతుందని మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తెలిపారు. కూటికి పేదవారైనా గుణానికి కాదని కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజల తీర్పు ఉంటుందన్నారు. నాలుగు పర్యాయాలు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన అనుభవం, ప్రజల నాడితో చెబుతున్నాను వచ్చేది టీడీపీ ప్రభుత్వమని, గెలిచేది కాకర్ల సురేష్ అని అన్నారు. గతంలో ఇద్దరు ఒకటైతే గెలిచేవారమని.. ఇప్పుడు నలుగురం అయ్యామని అత్యధిక మెజార్టీ సాధించాలన్నారు.అందుచేత అత్యుత్సాహానికి పోకుండా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని విజయ పదంలో నడిపించాలని కోరారు.

అభివృద్ధి చెందాలంటే వేమిరెడ్డి, కాకర్ల గెలవాలి: చంచల బాబు యాదవ్
రాష్ట్ర భవిష్యత్ బాగుండాలన్న పరిశ్రమలు రావాలన్న, యువతకు ఉద్యోగాలు కావాలన్నా రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు వల్లే ఇవన్నీ సాధ్యమని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత్ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ రియాజ్, సీతారాంపురం సర్పంచ్ భాగ్యమ్మ, జనసేన రాష్ట్ర కమిటీ నెంబర్ భోగినేని కాశీ రావు, కార్యదర్శి ఆలూరు రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు కొల్లూరు సురేందర్ రెడ్డి, ఉదయగిరి నాయకులు కుర్ర కృష్ణ యాదవ్, సీతారాంపురం అధ్యక్షులు తాటిచెట్టి శ్రీనివాసులు, ఉదయగిరి మండల నాయకులు పసుపులేటి తిరుపతయ్య, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కదిరి రంగారావు, జనసేన జోన్ ఇంచార్జ్ కె. వెంకటేశ్వర్లు, పలువురు నేతలు పాల్గొన్నారు.