Leading News Portal in Telugu

Chandrababu: పశుపతి అంటే పరమశివుడు.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తా..



Babu

Chandrababu: పశుపతి అంటే పరమశివుడు.. మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తాను అంటూ.. సీఎం వైఎస్‌ జగన్‌ తనను పశుపతి అంటూ చేసిన కామెంట్‌కు కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కొత్తపేటలో జరిగిన ప్రజాగళం రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ.. పశుపతి అంటూ నన్ను ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడడం చూసి నవ్వుకున్నా. ఎందుకంటే.. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడేందుకు వచ్చిన పరమశివుడు. గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళిని కాపాడాడు. అదే విధంగా నాపై ఎన్నో రకాల దాడులు చేశారు. అవహేళనలు చేశారు. అటు పవన్ కల్యాణ్ పై కూడా నిందలేశారు. మేం అన్ని రకాల అవమానాలను భరించాం. ఒకే నిబద్దత, ఒకే ఆలోచనతో నిలబడ్డాం. తెలుగుజాతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని రకాల దాడుల్ని ఎదుర్కొన్నాం. దాడులు ఎదుర్కోవడమే కాదు.. బుల్లెట్ మాదిరిగా దూసుకెళ్తాం అన్నారు.

రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు. ఎక్కడ చూసినా అదే స్పందన. గెలుపు మనదేనన్న ధీమా కళ్ల ముందు కనిపిస్తోంది. నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తున్నాం అన్నారు చంద్రబాబు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎదురు చూసినట్లు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రెండు బటన్లు నొక్కి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కోనసీమలో ఎప్పుడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసింది ప్రజల కోసమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుండి ఒకే మాటపై నిలబడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగా పడ్డ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసమే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నాం అన్నారు.

మద్య నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నాడు సీఎం జగన్‌..మరి అమలు చేశాడా? ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు అని విమర్శించారు చంద్రబాబు.. నిషేధం గాలికొదిలేసి.. రూ.60 ఉండే క్వార్టర్ రూ.200 చేశాడు. రూ.140 ఎవరి జేబుల్లోకి పోతోంది? తన ఆదాయం కోసం, తన ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. మద్యం తయారు చేసేది వీళ్లే, సరఫరా చేసేది వీళ్లే, అమ్మేది వీళ్లే. నిషేధం పేరుతో మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లుగా పరదాలు కప్పుకుని తిరిగాడు. ఆకాశంలో వెళ్తే కూడా చెట్లు నరికేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి మోసపూరిత హామీలతో వస్తున్నాడు. అలా వచ్చిన వ్యక్తిని ప్రజలంతా ఏకమై నిలదీయాలి. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడిగే హక్కు లేదని నిలదీయాలి. నాశిరకమైన బ్రాండ్లతో అనారోగ్యం బారిన పడ్డారు. వేలాది మంది ప్రాణాలు తీశాడని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.