Leading News Portal in Telugu

AP Weather: ఏపీ వాసులకు అలర్ట్‌.. రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు



Summer

AP Weather: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు. ఐఎండీ సూచనల ప్రకారం.. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఈ సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 115 మండలాల్లో తీవ్ర, 245 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(109) :-
శ్రీకాకుళం24 , విజయనగరం25, పార్వతీపురంమన్యం14, అల్లూరిసీతారామరాజు6, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ11, కోనసీమ1, తూర్పుగోదావరి 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు 43.6, అనంతపురం జిల్లా తెరన్నపల్లి 43.5, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 43.2, శ్రీసత్యసాయి జిల్లా కుటగుల్లలో 43.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 97 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.