Leading News Portal in Telugu

Memantha Siddham Bus Yatra: మళ్లీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌



Cm Ys Jagan

Memantha Siddham Bus Yatra: ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర.. ఇచ్చాపురం వరకు సాగనుండగా.. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర ఉంది.. అయితే, నేడు ఉగాది పండుగ సందర్భంగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.. శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో ప్రత్యేక టెంట్ హౌస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి బసచేసిన విషయం విదితమే కాగా.. నేడు శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భద్రతా కారణాలు, పరిమిత స్థల కారణాల రీత్యా, ముఖ్య నాయకులకు మాత్రమే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు..

Read Also: Guntur Kaaram: ‘గుంటూరు కారం’ను ఎంజాయ్‌ చేయలేకపోయా: జగపతి బాబు

మరోవైపు.. ఏపీ ప్రజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్‌.. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఇక, క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏపీ ప్రభు­త్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ రోజు తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు, ఆలయ అర్చకులను సత్కరించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. రాష్ట్ర దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఉదయం 9 గంటలకు కప్పగంతుల సుబ్బ­రామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు..