
మేం అట్టా ప్లాన్ వేయగానే…. అవతలోళ్ళకి ఇట్టా ఎట్టా తెలిసిపోతోంది? పక్కనే ఉంటూ వెన్నుపోట్లు పొడిచే బ్యాచ్ ఎక్కువైపోతోందా అని తెగ టెన్షన్ పడుతున్నారట ఆ ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు. పైకి అంతా మనోళ్ళే అనిపిస్తున్నా… ఎవర్ని ఎంత వరకు నమ్మాలో అర్ధంగాక బుర్రలు గోక్కుంటున్నారట. నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ జిల్లాలో ఉన్నారు? ఏంటా కథ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అత్యంత సన్నిహితులను చూసినా భయపడుతున్నారట. వాళ్ళు, వీళ్ళు అని లేదు… రోజూ వెంట ఉండే నాయకుల దగ్గర నోరు తెరవాలన్నా… ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారట. నోట్లో నుంచి మాట రావడం ఆలస్యం వెంటనే చేరకూడని చోటుకు చేరిపోతుండటంతో…. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని అనుమానించాలో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. రెండు పక్షాల్లో సీటు రాకుండా మిగిలిపోయిన ఆశావహుల గేమ్ ప్లాన్స్ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీటు రాకపోయినా బాధ లేదన్నట్టుగా కలరింగ్ ఇస్తూ… వ్యూహాల గురించి తెలుసుకుని ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నారన్నది అభ్యర్థుల అనుమానమని తెలిసింది. ముఖ్యంగా చిత్తూరు, మదనపల్లె, సత్యవేడులో ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. చిత్తూరు టీడీపీ సీటు కోసం ఏడుగురు అభ్యర్ధులు పోటీపడ్డా పార్టీ మాత్రం గురజాల జగన్ మోహన్‌కు సీటు ఇచ్చింది. పార్టీ పెద్దలు మిగతా ఆశావహులకు సర్దిచెప్పి అంతా కలిసి పనిచేయమని ఆదేశించారు. పెద్దగా అలకల తలనొప్పులు లేకపోవడంతో… అభ్యర్థి గురజాల కూడా అంతా సెట్ అయిందని అనుకున్నారట. అయితే… పైకి బాగానే మాట్లాడుతూ… కొందరు నాయకులు లోలోపల చేస్తున్న పనుల గురించి తెలిసి గురజాల షాకవుతున్నట్టు తెలిసింది. కోవర్ట్ వ్యవహారాలు పెరిగిపోతున్నాయన్న ప్రచారంతో గురజాల బుర్ర గిర్రున తిరిగిపోతోందంటున్నారు పరిశీలకులు. ఏదైనా ప్రచారం విషయంలోగాని, మరో రకంగాగాని…. తాను ఇట్టా ప్లాన్ వేయగానే…ప్రత్యర్థికి అట్టా లీకులు వెళ్ళిపోతుండటంతో షాకవడం జగన్మోహన్ వంతవుతోందట. మేటర్‌ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడంతో… వాళ్ళు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం.
అలా లీకులు ఇస్తూ కోవర్టు ఆపరేషన్ చేస్తున్న కొందరి వివరాలు సేకరించి పెద్దలకు పంపారట సీనియర్స్. ఇక సత్యవేడులో ఆదిమూలంకు సీటు ఇవ్వకూదని ధర్నాలు చేసినా వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇదే పరిస్థితి కాళహస్తిలో కూడా ఉందట. టిడిపి,జనసేన,బిజెపి నేతలు పైకి సర్లే… కానీయండి అంటూ అభ్యర్ధులకు జై కొడుతున్నా… ఎవరెవరు ఏ టైప్‌లో అండర్‌గ్రౌండ్ వర్కౌ చేస్తూ… సీటు కిందికి నీళ్ళు తెస్తున్నారోనని తెగ టెన్షన్ పడుతున్నారట అభ్యర్థులు. ఇక నగరి వైసిపి అభ్యర్థి రోజా శిబిరంలోనూ ఇదే తరహా చర్చ నడుస్తున్నట్టు తెలిసింది. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడాక సైలెంట్ గా ఉన్నారు రోజా వ్యతిరేక వర్గం నేతలు. వాళ్ళంతా పైకి కామ్‌గా కనిపిస్తున్నా… కనిపించకుండా ఏదో చేస్తున్నారన్న అనుమానం మాత్రం మంత్రి శిబిరాన్ని వెంటాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్న మాట నగరిలో గట్టిగానే వినపడుతోంది. కొందరు నాయకులు తమ వర్గం అండగా ఉంటుందని ఎంత చెబుతున్నా… ఎక్కడో తేడా కొడుతోందన్న భయం మాత్రం అభ్యర్థులకు పోవడం లేదని తెలిసింది. దానికి తోడు అభ్యర్ధులు అనుచరులు వాళ్ళు అది చేస్తున్నారటా…వీళ్ళ లెక్క ఇదంటా అంటూ అభ్యర్దుల్లో లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారన్నది సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పుడు పైకి కామ్‌గా కనిపిస్తున్న వారంతా తీరా… టైం దగ్గర పడినప్పుడు ఒక్కసారిగా రియాక్ట్ అయితే పరిస్థితి ఏంటన్న భయం కూడా అభ్యర్థులకు ఉన్నట్టు తెలిసింది. కాస్త అనుమానం ఉన్నవారి కదలికల మీద బాగా నమ్మకస్తులతో నిఘా పెడుతున్నారట క్యాండిడేట్స్. తమ మనుషులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయా నేతలకు ఇచ్చే ప్రాధాన్యతల్లో మార్పులు చేస్తున్నారట. ఎంత నిఘా పెట్టినా… ఏం చేసినా… ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతను గుర్తు చేసుకుంటూ… తెగ టెన్షన్ పడుతున్నారట టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.