Leading News Portal in Telugu

Peddireddy Ramachandra Reddy: ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం జగన్‌పై దాడి చేశారు..



Peddireddy

Peddireddy Ramachandra Reddy: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే దాడికి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోందన్నారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్‌పై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారన్నారు. సిద్ధం సభలు, బస్సు యాత్ర లో వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదన్నారు.

Read Also: Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య

లోకేష్ ట్విట్టర్‌లో 2019లో కోడి కత్తి, 2024లో రాయి దాడి అని పెట్టారని.. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుందని అన్నారు. ఎవరైనా రాయితో దూరం నుండి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా అంటూ ప్రశ్నించారు. అదే రాయిని లోకేష్‌కి ఇస్తాం, అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా రాయితో కొట్టించుకోవాలని ఎద్దేవా చేశారు. అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో తెలుస్తుందన్నారు. ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. గతంలో పాదయాత్ర కు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోందని అన్నారన్నారు. కృష్ణా జిల్లా ఇంచార్జీగా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశామన్నారు. మళ్ళీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో ఈ కుట్రకు తెరలేపారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.