Leading News Portal in Telugu

Janasena: జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన పవన్ కళ్యాణ్



Janasena

Janasena: జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందించారు. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ స్థానాలకు పవన్ బీ ఫారాలు అందించారు. తొలి బీ-ఫారం నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చారు. రేపట్నుంచి నామినేషన్లు ఉండడంతో ఇవాళే బీ-ఫారాలు అందించారు జనసేనాని పవన్‌కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు.. ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పవన్ పార్టీని నడిపారన్నారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి.. వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు.

అనంతరం జనసేన అభ్యర్థులకు బీ-ఫారం అందచేశామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన తెలిపారు. ఓట్లు చీలకుండా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డామని.. ఎలాగైనా రాక్షస పాలనను అంతమొందించాలన్నారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. శ్రీరామ నవమి రోజు బీ-ఫారాలు అందివ్వడం సంతోషంగా ఉందన్న ఆయన.. రామరాజ్యం వైపు రాష్ట్రాన్ని అడుగులు వేయించాలన్నారు. అనంతరం అభ్యర్థులతో పవన్‌ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేయించారు.

 

Read Also: Surya Tilak బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం.. లైవ్ వీక్షించిన ప్రధాని మోడీ

ప్రతిజ్ఞ ఇదే..
మూడు కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగరతీరంతో సకల సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్‌. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకీ తిప్పలు తప్పడం లేదు. అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అదోగతి పాలయింది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి, మళ్లీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారుగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగు వారి జీవన రేఖ పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య`ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా… వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణకు భూమిక సిద్దం చేయడమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి గెలుపే కర్తవ్యంగా కృషిచేస్తానని, మన పార్టీ నియమ`నిబంధనలకు కట్టుబడుతూ, కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతిమాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.