Leading News Portal in Telugu

Ap Elections: విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు



Glass Symbol

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన గాజు గ్లాస్ సింబల్ వివాదం క్రమంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం నేటితో ముగిసింది. సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే పనిలో ఎన్నికల అధికారులు పడ్డారు. గుర్తుల ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచిన విషయం తెలిసిందే. విజయనగరంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజుగ్లాసు గుర్తును కేటాయించారు. దీంతో అక్కడి కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. ఆమెకు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని నిబంధనల ప్రకారమే కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. రెబల్ అభ్యర్థికి జనసేనకు సంబంధించిన గుర్తు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి, అనుచరులు తమ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

READ MORE: Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..

కూటమి తరఫున సీట్లు పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం సీటు టీడీపీ కేటాయించారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి వినతులు సమర్పిస్తున్నారు. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు.