Leading News Portal in Telugu

AP Elections 2024: చూసైనా మారండి..! 104 ఏళ్ల తాతయ్య.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు..



Ramudu

AP Elections 2024: కొన్ని ప్రాంతాల్లో నమోదు అవుతోన్న పోలింగ్‌ శాతం ఆందోళనకు గురిచేస్తోంది.. పెద్ద ఎత్తున యువ ఓటర్లు పుట్టుకొస్తున్నా.. పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటేసేవారి సంఖ్య తగ్గిపోతోంది.. ముఖ్యంగా పట్టణాల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్టు నమోదు అవుతోన్న పోలింగ్‌ శాతాన్ని బట్టి తెలుస్తుంటుంది.. అయితే, ఓ తాతగారిని చూసి అంతా నేర్చుకోవాలి.. 104 ఏళ్ల వయస్సులోనూ ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకుని తన ప్రత్యేకత చాటుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వ్యాపారవేత్త రొంగల రాముడు. వయోవృద్ధులకు కేటాయించిన హోమ్ ఓటింగ్ ద్వారా 104 ఏళ్ల రాముడు.. 18వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిడదవోలులోనే తన స్వగృహానికి పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. దీంతో రాముడు ఇంటి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read Also: NTR 31 : ఎన్టీఆర్, నీల్ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్..?

అయితే, ఈ మధ్యే.. ఓటింగ్‌ ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్నికల కమిషన్‌.. వయోవృద్ధులు అంటే 85 ఏళ్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ అవకాశం ఇచ్చింది ఈసీ.. అయితే, ఏకంగా 18 సార్లు ఓటు హక్కు వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు రొంగల రాముడు అనే తాతయ్య. ఇప్పటికైనా కదలండి యువత.. ఓటు హక్కు వినియోగించుకొండి.. నచ్చిన నాయకుడికి ఓటు వేసి మెచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకొండి. కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఎట్ హోం నిన్నటి నుంచే ప్రారంభమైంది.. ఇక, ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుండగా.. వచ్చే నెల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న విషయం విదితమే.