Leading News Portal in Telugu

Budi Mutyala Naidu vs Budi Ravi: రచ్చకెక్కిన తండ్రీకొడుకులు.. డిప్యూటీ సీఎం సొంతూరు తారువలో ఉద్రిక్తత



Budi Mutyala Naidu

Budi Mutyala Naidu: అనకాపల్లి జిల్లాలోని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామమైన తారువలో ఉద్రిక్తత ఏర్పడింది. బూడి ముత్యాల నాయుడు, ఆయన కుమారుడు బూడి రవిల మధ్య గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది. కూటమి తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌కు బూడి రవి మద్దతిస్తున్నట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పుడు తండ్రీ కొడుకుల మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. సీఎం రమేష్‌తో కలిసి బూడి రవి తారువ గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ముత్యాల నాయుడు ఇంటికి 100 మీటర్ల దూరంలో వారిని పోలీసులు ఆపేశారు. అయితే ఆ ఇంటికి వెళ్లిన బూడి రవి ఇల్లు తన తాతదని వాదించారు. ఇల్లు తన పేరు మీద ఉందని లీగల్‌గా తేల్చుకోవాలని బూడి ముత్యాల నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చెలరేగింది.

Read Also: Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై విచారణ జరపాలని సీఐడీకి ఈసీ ఆదేశం

ఇదిలా ఉండగా.. సీఎం రమేష్‌ వాహనాన్ని బూడి ముత్యాల నాయుడు అనుచరులు ముట్టడించారు. కారుపై దాడికి యత్నించారు. వందల మంది చేరుకోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది. సీఎం రమేష్ వాహనాల్లోన ఒకటైన జీపును ధ్వంసం చేశారు. రౌడీ రాజకీయాలు మా గ్రామాలలో వద్దు అంటు నినాదాలు చేశారు. అనంతరం బూడి అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. సీఎం రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గ్రామంలోని కూటమి నేతలు అడ్డుకున్నారు. రాజకీయ కారణాలతో కుటుంబంలో తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు కారణం అయింది.