Leading News Portal in Telugu

Daggubati Purandeswari: కుట్రలు జరుగుతున్నాయి.. భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..


  • కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..

  • మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు.. స్వాతంత్య్రం తెచ్చారు..

  • ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్న పురంధేశ్వరి..
Daggubati Purandeswari: కుట్రలు జరుగుతున్నాయి.. భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..

Daggubati Purandeswari: కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. ఇక, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు.. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది అన్నారు.. ఆనాడు 40 కోట్ల మంది దేశ ప్రజలు ఈ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు.. ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్లు ఉన్నారు.. మన దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.

ఇక, ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు పురంధేశ్వరి.. కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలన్న ఆమె.. 2040 నాటికి వికసిత భారత్ చూడాలనేది లక్ష్యం.. వికసిత భారత్ కోసం మనం అంతా కలిసి పని‌చేయాలి.. రాష్ట్ర అభివృద్ధికి అంకితం అయి ముందుకు సాగాలి అన్నారు.. మొన్న ఎన్నికలలో ‌ప్రజలు‌ కూటమికి తిరుగు లేని అధికారం ఇచ్చారు.. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించిందన్నారు.. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు.. ప్రజలు సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్ లో ‌కూడా పెడతాం అన్నారు.. ప్రజలకు సేవకులుగా పని చేసి.. వారి కన్నీరు తుడుస్తాం అన్నారు.. ఇక, ఈ సందర్భంగా వినతుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.