
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా… ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో కాస్త సౌండ్ పెంచే ప్రయత్నం చేసినా…. వెంటనే మ్యూడ్ మోడ్ ఆన్ చేయడానికి కారణమేంటి? ప్రస్తుతం పూర్తిగా చెన్నైకే పరిమితమైన రోజాను గతం వెంటాడుతోందా? ఆడుదాం ఆంధ్రాపై ఎంక్వైరీ… ఆడేసుకుంటానని అంటోందా? ఆటలో నెక్స్ట్ పడే వికెట్ ఏది? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్స్ అనగానే ఎక్కువ మందికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్కే రోజా. ఆమె మాటలు, చేతలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి… మంత్రిగా పనిచేసిన రోజా….ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పొలిటికల్ అజ్ఞాతవాసి అయ్యారు. తన నోరే తనకు ప్లస్ అని బాగా నమ్మే మాజీ మంత్రికి.. చివరికి ఆ నోరే శాపమైందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అధికారంలో ఉన్న ఐదేళ్ళు… ఇష్టానుసారం నోరు పారేసుకోవడం, ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా దూషించడం లాంటి చర్యలతో ఆమె తన స్థాయిని తానే దిగజార్చుకున్నారని, ఆ ఫలితాన్నే ఇప్పుడు అనుభవిస్తున్నారన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న టాక్. అంతేకాకుండా మంత్రి అయ్యాక ఆమె చేసిన హంగు, ఆర్భాటం, స్థానిక నేతలతో తలెత్తిన విభేదాలు అన్నీ కలగలిసి ఎన్నికల్లో గట్టి దెబ్బే కొట్టాయంటారు. ఓటమి తర్వాత పూర్తిగా చెన్నైకి మకాం మార్చారు రోజా. అయినా గత తప్పిదాలు ఇప్పుడామెను వెంటాడబోతున్నాయా అన్న డౌట్స్ వస్తున్నాయట పొలిటికల్ పండిట్స్‌కు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వైసీపీ నేతలు. పోలింగ్ సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు బుక్ చేశారు పోలీసులు. ఇక టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో ఇప్పటికే జైలుకు వెళ్ళారు ఆయన కొడుకు. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ… మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్నిప్రమాదం సహా ఇతర భూ అక్రమాలు కేసులు ముసురుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిక రోజా వంతు వచ్చిందా అన్న చర్చ మొదలైందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలైనట్టు తెలుస్తోంది. సీఐడీ దర్యాప్తు మొదలవడంతో… అప్పటి క్రీడా మంత్రిగా రోజా మీద యాక్షన్ ఉండవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అందులో ఆటగాళ్లకు కిట్ల కొనుగోలు కోసం 40కోట్లు, కేవలం బ్రోచర్లు, జెర్సీలు,టోపీలకే నాలుగు కోట్లు ఎలా ఖర్చయ్యాయన్న ఎంక్వైరీ మొదలైంది. పోనీ… ఆ కొన్నవేమైనా నాణ్యంగా ఉన్నాయా అంటే అదీలేదు. పోటీలు జరుగుతున్నప్పుడే క్రికెట్ బ్యాట్స్ విరిగిపోయాయి. వీటన్నిటినీ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు కొలిక్కి వచ్చాక ఈ కేసులో కూడా కొన్ని అరెస్ట్‌లు ఉండవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఆ ఊహాగానాలకు, రోజా చెన్నై మకాంకు ముడిపెట్టి మాట్లాడే వాళ్ళు సైతం పెరుగుతున్నారట.
నడిచినన్నాళ్ళు నడిపించాం… ఇక టైం బ్యాడ్ అయినప్పుడు అనవసరంగా ఆయాసపడటం ఎందుకనుకుంటూ… రోజా కావాలనే కామ్ అయ్యారన్న వాదన సైతం ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో. అయితే ఆడుదాం ఆంధ్ర దర్యాప్తు మాత్రం చాలా దూరం వెళ్తుందన్న చర్చ గట్టిగానే జరుగుతోందట. ఓవైపు ఆ దర్యాప్తు అలా జరుగుతుండగానే… మరోవైపు గతంలో తాము చేసిన ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించే పనిలో బిజీగా ఉన్నారట నగరి టీడీపీ నేతలు. నగరిలో టిటిడి ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల కోసం భూమి కొన్నప్పుడు రైతుల నుంచి పది శాతం కమీషన్ వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో మాజీ మంత్రి సోదరుల దందాలు, తిరుమల దర్శనాల వివాదాలు, బెంజ్ కారు ఎపిసోడ్, వైజాగ్‌లో భూములు…ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా అన్నిటి మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్ర స్థాయి వ్యవహారాలపై పార్టీ దృష్టి పెట్టగా… నగరిలో రోజా, ఆమె సోదరుల వ్యవహారాలపై ఎమ్మెల్యే భానుప్రకాష్ దృష్టి పెట్టి ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చాలవన్నట్టు వైసీపీలోనే రోజాతో విభేదించిన వ్యతిరేక వర్గం మరో ఫైల్ సిద్ధం చేస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది నగరిలో. ఇప్పుడు రోజా ఎంత మౌనంగా ఉండి… నన్ను వదిలేయండని అనేలా ప్రవర్తిస్తున్నా…. ప్రత్యర్థులు మాత్రం వదల బొమ్మాళీ అంటున్నారన్నది నగరి పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న టాక్. దీంతో నెక్స్ట్ వికెట్ ఆమెదేనా అన్న చర్చ జరుగుతోందట. ఎప్పుడూ అటాకింగ్ మోడ్‌లో ఉండే రోజా.. ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి మారడాన్ని బట్టే ఆమెకు భవిష్యత్ కనిపిస్తోందా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇలాంటి రకరకాల చర్చలతో నగరిలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.