Leading News Portal in Telugu

AP Government: అనకాపల్లి ఘటనతో ప్రభుత్వం అలర్ట్‌.. సీఎం కీలక ఆదేశాలు..


  • అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ప్రభుత్వం అలర్ట్‌..

  • రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ.. ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు.. హాస్టళ్లను తనిఖీ చేయాలి..

  • జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు..
AP Government: అనకాపల్లి ఘటనతో ప్రభుత్వం అలర్ట్‌.. సీఎం కీలక ఆదేశాలు..

AP Government: అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు జారీ చేశారు.. హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లేదో? చూడాలని కలెక్టర్లకు సూచించారు సీఎం.. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.. బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, ఆరోగ్యకరమైన పరిస్థితుల ఉన్నాయో లేదో చూడాలని పేర్కొన్నారు.. సంబధిత విభాగాలు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.

కాగా, కలుషిత ఆహారం కాటేసిన ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చిన ఈ దారుణం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కొన్నేళ్లుగా పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ నడుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన 90 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. మతపరమైన కార్యకలాపాలు నిర్వహించే కిరణ్ కుమార్ ఈ ట్రస్ట్ చైర్మన్. కనీస వసతులు లేని రేకుల షెడ్ లో నడుస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు శనివారం సాయంత్రం కలుషిత ఆహారం తిన్నారు. పునుగుల కూర, సమోసా, బిర్యానీ వంటి ఫుడ్ తినగా పిల్లల్లో డయేరియా లక్షణాలు కనిపించాయి. మొదట స్వస్థత గురైన ఒకర్ని కోటవురట్ల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

ఈ క్రమంలో బాధితుల సంఖ్య పెరగడం, చిన్నారులు ఆరోగ్యం విషయంగా మారుతుందని పసిగట్టిన కిరణ్… కుటుంబ సభ్యులను పిలిపించి పిల్లలను వారి వెంట పంపించేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు, బంధువులు ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో తీవ్ర స్వస్థత కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పిల్లలు చేరడంతో అల్లూరి జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. అప్పటికే ముగ్గురు మరణించారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో అనకాపల్లి జిల్లా అధికార యంత్రం హుటాహుటిన బాధిత విద్యార్థులను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించింది. మెరుగైన వైద్య కోసం 14 మందిని విశాఖ kgh కు తరలించారు. వీరిలో ఒక పాప మినహా మిగినలిన వాళ్ళందరూ ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని హోం మంత్రి అనిత చెప్పారు. ఇళ్లలో ఉన్న మిగిలిన పిల్లలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురాగా… ఈ ఘటనకు బాధ్యుడైన కిరణ్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు.