- సంయుక్త లాంటి రాజకీయ నాయకులు ఈ దేశానికి ఎంతో అవసరం
- సర్పంచ్ సంయుక్త ఆశయం నాకెంతో నచ్చింది
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కదిలించిన మహిళా సర్పంచ్ కారుమంచి సంయుక్త

Pawan Kalyan: దేశ సేవ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భర్త ఆశయం కోసం ఆయన భార్య నడుం బిగించింది. పచ్చని గ్రామాలే ప్రగతికి మెట్టు అన్న ఆయన ఆశయానికి ఆమె పునాది వేసింది. ఆ ఆశ నెరవేర్చడం కోసం ఆమె రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేసింది. అయితే జనసేన పార్టీ ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఆశయం విన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తనను కదిలించింది అనడం విశేషం….. ఇంతకు ఎవరు ఆ సర్పంచ్… ఏమిటి ఆమె ఆశయం.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మైసూర్ వారి పల్లి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భర్త ఆశయం కోసం ఆమె రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. దేశ సేవ చేయడం కోసం ఆర్మీలో చేరిన కారుమంచి వెంకటసుబ్బయ్య తన పదవి అనంతరం గ్రామ సేవకు కంకణం కట్టుకున్నారు. కరోనా సమయంలో గ్రామస్థులకు అన్ని తానై నిలిచాడు. తిరుపతిలో కరోనా పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త మృతి చెందిన రెండు నెలలకే భార్య కారుమంచి సంయుక్త సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 2021 లో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తుంటే రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లిలో మాత్రం జనసేన జెండా రెపరెపలాడింది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల అభ్యర్థులు మధ్య జరిగిన హోరాహోరీ సర్పంచ్ ఎన్నికలలో కారుమంచి సంయుక్త 455 ఓట్లతో విజయ కేతనం ఎగురవేశారు. అయితే ఆమె కష్ట కాలంలో ఆమెకు జనసేన అండగా నిలిచింది. రాయలసీమలోనే మొదటి జనసేన సర్పంచ్ గా ఎంపికయ్యారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలోని అన్నమయ్య తిరుపతి జిల్లాలలో జనసేన పోటీ చేసింది. తిరుపతి రైల్వే కోడూరు నియోజకవర్గాలలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు. వీరికంటే ముందు రైల్వే కోడూరు మండలంలోని మైసూర్ వారి పల్లి సర్పంచ్ గా కారుమంచి సంయుక్త విజయకేతనం ఎగురవేశారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయలసీమ పర్యటనలో మైసూరు వారి పల్లెను ఎన్నుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఒత్తిడిలు పెట్టిన వెన్ను తిరగకుండా కుటుంబంలో భర్తను కోల్పోయిన బాదన సహితం పంటి బిగువున దాచుకొని పార్టీ కోసం పనిచేసే సర్పంచిగా గెలుపొందిన నన్ను కదిలించిందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటే ఆమె త్యాగం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఆశయం కోసం తాను కూడా కృషి చేస్తానని బహిరంగంగా ప్రకటించడం విశేషం. భర్త చనిపోయి రెండు నెలలు కూడా గడవకమునుపే ఆయన ఆశయం కోసం ఆమె రాజకీయాల్లోకి వచ్చి అధికార పార్టీపై పోటీకి దిగడం తనకు ఆదర్శం అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి అధికారిక కార్యక్రమాన్ని మైసూర్ వారి పల్లిలో నిర్వహించడానికి ఇదే కారణమని ఆయన వివరించారు. గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలని సంయుక్త లాగా ప్రతి మహిళ ఓ రాజకీయ నేతగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కొనియాడారు.