- అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేసిన హోంమంత్రి అనిత
- బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

Home Minister Anitha: విశాఖలోని గాజువాక వడ్లపూడి పవన్ సాయి ఆస్పత్రిలో అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేశారు హోం శాఖ మంత్రి అనిత. బాధితులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షల రూపాయలు అందజేశామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులుకు అండగా నిలబడ్డామన్నారు. ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారిని ఓదార్చారని తెలిపారు. అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. విశాఖ మెడికవర్, కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎంత ఖర్చు అయినా అందరికీ వైద్య సేవలందిస్తామన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 లక్షలు పరిహారం అందజేస్తామన్నారు.