Leading News Portal in Telugu

Rajya Sabha: ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం


  • మోపిదేవి వెంకట రమణ..బీద మస్తాన్ రావు రాజీనామాలు ఆమోదం
  • రెండు స్థానాలు ఖాళీ అయినట్లు రాజ్యసభ బులెటిన్ విడుదల
Rajya Sabha: ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

Rajya Sabha: రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌కడ్‌కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్‌ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ బులిటెన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వెంకటరమణ, మస్తాన్ రావులు రాజీనామా చేశారు. ఖాళీ అయిన రెండు స్థానాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మోపిదేవి ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా… బీద మస్తాన్ రావు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండేళ్లుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బీదమస్తానరావు తెలిపారు. కుటుంబసభ్యులు, మిత్రులతో చర్చించిన తర్వాత రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పారు. మోపిదేవి టీడీపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ సీటుపై ఆసక్తి లేకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. స్థానిక ప్రజలను వీడి ఢిల్లీకి రావడం ఇష్టం లేదని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. మోపిదేవికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బీద మస్తాన్ రావు కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది.