Leading News Portal in Telugu

MLA Adimoolam Case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్‌..! వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు..!


  • ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం..

  • విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని‌ భావించిన పోలీసులు..

  • అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందన్న బాధితురాలు..

  • వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని కోరిన మహిళ..
MLA Adimoolam Case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్‌..!  వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు..!

MLA Adimoolam Case: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని‌ పోలీసులు భావించారు.. అయితే, అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందని చెబుతున్న బాధితురాలు వరలక్ష్మి.. తనకు వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని ఈస్ట్ పోలీసులను కోరారు.. అనారోగ్య సమస్యలు.. గుండె నొప్పితో బాధపడుతున్న నాకు.. వైద్య పరీక్షల కోసం కొంత సమయం ఇవ్వాలంటూ రాతపూర్వకంగా పోలీసులను కోరారు వరలక్ష్మి. దీంతో అమెకు వైద్య పరీక్షలను పూర్తిగా కోలుకున్నాక నిర్వహించడానికి అంగీకరించారు పోలీసులు..

కాగా, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.. ఎమ్మెల్యే తీరుపై బాధితురాలు మీడియాకు ఎక్కడంతో చర్చగా మారింది.. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది టీడీపీ.. మరోవైపు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఆదిమూలానికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించానని, చంద్రబాబు నిర్ణయం మేరకు ఒప్పుకుని ఆయన గెలుపు కోసం పనిచేసానని చెప్పుకొచ్చిన సదరు మహిళ.. ఆ తర్వాత తనను హోటల్ కు పిలిపించి అత్యాచారం చేశాడని.. ఆ తర్వాత కూడా మళ్లీ రమ్మని వేధిస్తుంటే రెండుసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లా.. మూడోసారి తన భర్త ఇచ్చిన పెన్ కెమెరాతో మొత్తం వ్యవహారం రికార్డు చేసినట్టు పేర్కొన్న విషయం విదితమే..