- ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
- దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులు పూర్తి
- నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. బ్యారేజిలోని 67,69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులను పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీలుతో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు. నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో కేవలం 5 రోజుల లోపే మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టి పూర్తి చేసింది. రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్య నాయుడు సన్మానించారు. మార్గదర్శనం చేసిన నిపుణుడు కన్నయ్య నాయుడిని ఇంజినీర్లు, అధికారులు సన్మానించారు.
ఈ సందర్భంగా గేట్ల సలహాదారు, నిపుణుడు కన్నయ్యనాయుడు మాట్లాడుతూ.. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద వేగంగా మరమ్మతులు పూర్తి చేశామని.. నాలుగు రోజుల్లోనే కీలక పనులను వేగంగా పూర్తి చేశామంటూ వెల్లడించారు. ప్రస్తుతం మరమ్మతులు చేసిన 3 గేట్లూ సమర్థంగా పని చేస్తున్నాయన్నారు. తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ గేట్లను మరమ్మతులు చేసి పంటలను కాపాడటం సంతోషం కలిగించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సహకారం, ప్రోత్సాహంతోనే వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం ఎనలేనిదన్నారు. రైతులకు నష్టం జరగకూడదనే రేయింబవళ్లు కష్టపడి పని చేసి పనులు పూర్తి చేశామన్నారు. ఏపీలో లక్షల ఎకరాల్లో పంటను కాపాడటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తనకు సహకరించిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి కన్నయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు.