- రాష్ట్రంలో ఆకస్మిక వరదలు వల్ల నష్టాన్ని పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదు.. -
ఇప్పటికే అమరావతి.. పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది: కేంద్రమంత్రి

Bhupathiraju Srinivasa Varma: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లా శ్రీనివాస్ రాజీనామా చేస్తానని చేసిన ప్రకటనపై స్పందించడానికి కేంద్ర మంత్రి నిరాకరించారు.
కాగా, రాష్ట్రంలో ఆకస్మిక వరదలు రావడంతో నష్టాన్ని పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కేంద్ర ఉక్క, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. నష్ట నివేదికలు కేంద్రానికి అందాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని అన్నారు. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు మోడీ సర్కార్ నిధులు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు.