- వరద నష్టంపై బాధితులకు పరిహారం ప్యాకేజీపై ప్రభుత్వం ఉత్తర్వులు
- మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో జారీ

Andhra Pradesh: వరద, పంట నష్టంపై బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం ప్యాకేజీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ కంటే మించిన స్థాయిలో ఆర్థిక సాయాన్ని చంద్రబాబు సర్కారు ప్రకటించింది. ఇళ్లు, పంటలు, వ్యాపారాలు, ఉపాధి, పరిశ్రమలు, పశువులు, కోళ్లు, వాహనాలకు జరిగిన నష్టంపై ఆర్థిక సాయం ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాధితులకు రూ. 25 వేలు, ఫస్ట్ ఫ్లోర్.. ఆ పైన ఉన్న నివాసం ఉన్న బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో నష్టపోయిన ఇళ్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.
విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని కిరాణా, రెస్టారెంట్ వంటి చిన్న తరహా వ్యాపారులకు రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని సర్కారు అందజేయనుంది. అలాగే చిన్న తరహా పరిశ్రమలకు, టూవీలర్లకు నష్టపరిహరం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంట నష్టం పైనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పంటల వారీగా రూ. 35 వేల నుంచి రూ. 1500 వరకు వివిధ పంటలకు.. చెట్లకు పరిహరం ప్రకటించింది.