Leading News Portal in Telugu

Tirumala Laddu: ఏఆర్‌ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు


  • నెయ్యి వ్యవహారంపై ఏఆర్ డెయిరీపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు
  • ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ
Tirumala Laddu: ఏఆర్‌ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు

Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.10 లక్షల కేజీల నెయ్యి సప్లైకీ ఏఆర్ డెయిరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన సప్లై ఆర్డర్స్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25వ తేదీతో పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డెయిరీ సప్లై చేసిందని ఆయన వెల్లడించారు.

ఆడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండా.. గతంలో వున్న పాత విధానాల టెస్టింగ్‌ని నిర్వహించి..ఈ నెయ్యిని టీటీడీ వినియోగించిందన్నారు. లడ్డు నాణ్యత పై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో NDBL సహకారంతో ఆడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. జులై 6,12 వ తేదీల్లో ఏఆర్ డెయిరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం NDBL ల్యాబ్ కు పంపామన్నారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని ఆయన చెప్పారు. కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22,23,27 వ తేదీల్లో ఏఆర్ డెయిరీకీ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.

నెయ్యిలో తాము ఎలాంటి కల్తీ చెయ్యలేదని సెప్టెంబర్ 4వ తేదీన ఏఆర్ డెయిరీ టీటీడీకి రిప్లై ఇచ్చిందన్నారు. టీటీడీ నియమ నిబంధనలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్‌ డెయిరీపై పోలీసులు కేసు నమోదు చేశారు.